బత్తాయి కొనేవారేరి?

ABN , First Publish Date - 2020-05-10T09:14:38+05:30 IST

కరోనా కారణంగా ఈ ఏడాది బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు లేక.. తెలంగాణలో అముక్కకోలేక ఆందోళన చెందుతున్నారు.

బత్తాయి కొనేవారేరి?

ముందుకురాని వ్యాపారులు

నేడు ఎల్బీ స్టేడియంలో బత్తాయి డే


నల్లగొండ/పెద్దవూర/హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా ఈ ఏడాది బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు లేక.. తెలంగాణలో అముక్కకోలేక ఆందోళన చెందుతున్నారు. రోగ నిరోధక శక్తి పెరగాలంటే బత్తాయిలను తినాలని, రైతులు ఎగుమతులు మానేసి రాష్ట్రంలోనే బత్తాయిలను అమ్మాలని, అందుకు ఏర్పాట్లు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తర్వాత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బత్తాయిని ఢిల్లీలోని ఆజాద్‌ మార్కెట్‌కు ఎగుమతి చేస్తామన్నారు. కానీ ఈ ప్రకటనలు ఆచరణకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వమే 200 కోట్లు కేటాయించి బత్తాయిని కొనుగోలు చేసి చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తే  రైతులు లాభపడతారని, నిరుపేదల ఆరోగ్యం మెరుగుపడు తుందని పలువురు భావిస్తున్నారు.


పడిపోయిన ధరలు

మొదటి నుంచి తెలంగాణ బత్తాయిని కర్నూలు జిల్లాకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ఈసారి లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యాపారులు కొనలేదు. కొన్ని చోట్ల కొనేవారు ఉన్నా రవాణా సౌకర్యం లేదు. దీంతో బత్తాయి ధర పూర్తిగా పడిపోయింది. రైతులే స్వయంగా వాహనాల్లో తిరుగుతూ రూ. 100కు 5 కిలోల చొప్పున విక్రయిస్తున్నా.. రవాణా ఖర్చులు కూడా మిగలట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండల రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై బత్తాయి కాయలు పోసి తగులబెట్టారు.


నేడు బత్తాయి డే

‘మనదగ్గర పండిన పండ్లను మనమే కొనుక్కుందాం- రైతుకు లాభం, మనకు ఆరోగ్యం’ అన్న రాజ్యసభ స భ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపు మేరకు ‘వాక్‌ ఫర్‌ వాటర్‌’ సంస్థ ఆదివారం ‘బత్తాయి డే’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కాగా, ఎల్బీ స్టేడియంలో ‘బత్తాయి డే’ను నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు.  

Updated Date - 2020-05-10T09:14:38+05:30 IST