కరోన ఎఫెక్ట్ ...యూరయా దుకాణాలు బంద్
ABN , First Publish Date - 2020-03-24T08:37:36+05:30 IST
కరోన ప్రభావం ఇప్పుడు అన్నదాతలపై పడనుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో దాదాపు 25 వేల హెక్టార్లలో వరి, 10వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వరి

ఎరువుల కోసం రైతుల ఎదురు చూపులు
ఎరువుల దుకాణాలకు ప్రత్యేక సమయం కేటాయించాలని రైతుల డిమాండ్
వరంగల్‌అర్బన్ అగ్రికల్చర్, మార్చి 23 : కరోన ప్రభావం ఇప్పుడు అన్నదాతలపై పడనుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో దాదాపు 25 వేల హెక్టార్లలో వరి, 10వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వరి గింజగట్టి పడి, పాలు పోసే దశలో ఉంది. మొక్కజొన్నకు కంకులు వచ్చాయి. చివరి దశగా ఇప్పుడు వరి పొలాల్లో రైతులు ఎరువులు (యరియా, డిఏపీ) వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కాని ప్రస్తుతం ప్రపంచాన్ని సైతం గడగడలాడిస్తున్న కరోన భూతం ప్రభావం సాగు రంగంపై పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఈనెల 22న ‘జనత కర్ఫ్యూ’ ను దేశ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి విజయవంతం చేయగలిగారు. కాని జనతా కర్ఫ్యూను మార్చి 31 వరకు పొడగిస్తూ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలకు కావాల్సిన నిత్యావరసరాల సరుకులు, కూరగాయలు లోటు లేకుండా చూస్తామంటూ హామీలిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూరగాయ దుకాణాలు, కిరాణం దుకాణాలను తెరుచుకునే వెసులుబాటు కల్పించాలయి.
కాని పంటలు పండించే రైతులకు మాత్రం కడగండ్లే మిగిలేలా ఉన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాలు బంద్ చేసి ఉండటంతో అయోమయం పరిస్థితిలో ఉన్నారు. యాసంగిలో అకాల వర్షాలు, చీడపీడలను తట్టుకుని చివర దశలో ఉన్న పంటలను రక్షించుకునే దశలో కరోన ప్రభావంతో ఎరువులు అందుబాటులో లేక పంటల దిగుబడి తగ్గిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇదే పరస్థితి కొనసాగితే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తిండి గింజలకు కూడా నోచుకోలేక ఆకలి చావులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎరువుల దుకాణాలు తె రిపించాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రస్తుతం కొత్త పంటలు వేసుకోవాలన్నా విత్తనాలు అవసరమని అందుకోసమైనా విత్తనాల దుకాణాలు, ఫర్టిలైజర్, పురుగు మందుల దుకాణాలను రోజులో ఒక ప్రత్యేకమైన సమయంలోనైనా తెరిపించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.