కరోనా కమ్యూనిటీ స్ర్పెడ్ జరగలేదు: ఈటల
ABN , First Publish Date - 2020-04-05T07:42:25+05:30 IST
రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ స్ర్పెడ్ (మూడో) దశకు చేరుకోలేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుత పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చిన వారు...

హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ స్ర్పెడ్ (మూడో) దశకు చేరుకోలేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుత పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చిన వారు, వారితో కలిసినవారేనన్నారు. షాద్‌నగర్, సికింద్రాబాద్‌లో మృతులూ ఢిల్లీ నుంచి వచ్చినవారితో కలిసిన వారేనని పేర్కొన్నారు. ‘మర్కజ్ నుంచి వచ్చిన 1,090 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. క్వారంటైన్ కేంద్రాల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఎన్ని పాజిటివ్ కేసులొచ్చినా చికిత్సకు ఏర్పాట్లు చేశాం. 5 లక్షల ఎన్-95 మాస్కులు, 5 లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల వైరల్ ట్రాన్స్‌మిషన్ కిట్లు, 500 వెంటిలేటర్లు, 4 లక్షల పరీక్షా కిట్లు, 20 లక్షల సర్జికల్ మాస్కులు, 25 లక్షల హ్యాండ్ గ్లౌజులు కొనుగోలు చేశాం. గచ్చిబౌలిలో 1,500 పడకల ఆస్పత్రి రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుంద’న్నారు.