పాజిటివ్స్‌లో లక్షణాలు లేకుంటే 10 రోజుల్లోనే కరోనా నిర్వీర్యం

ABN , First Publish Date - 2020-07-22T08:46:44+05:30 IST

కరోనా సోకినా ఎలాంటి లక్షణాలు లేనివారిలో వైరస్‌ చురుకుదనం 10రోజుల్లో తగ్గిపోయి నిర్వీర్యమవుతుందని రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యనిపుణులు

పాజిటివ్స్‌లో లక్షణాలు లేకుంటే 10 రోజుల్లోనే కరోనా నిర్వీర్యం

  • చురుకుదనాన్ని కోల్పోతున్న వైరస్‌
  • తర్వాత పాజిటివ్‌ వచ్చినా ముప్పుండదు

హైదరాబాద్‌ సిటీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): కరోనా సోకినా ఎలాంటి లక్షణాలు లేనివారిలో వైరస్‌ చురుకుదనం 10రోజుల్లో తగ్గిపోయి నిర్వీర్యమవుతుందని రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినా లక్షణాలు లేకపోతే భయపడాల్సిన పనిలేదని వారంటున్నారు. అసింప్టమాటిక్‌ పేషెంట్ల శరీరంలోని వైరస్‌ 10 రోజుల్లోనే శక్తిహీనంగా మారి వ్యాపించే గుణాన్ని కోల్పోతుందని, దాని వల్ల ఇతరులకు ముప్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. లక్షణాలు లేని వారికి 14-17 రోజుల తరువాత పరీక్షలో పాజిటివ్‌ వస్తే అది డెడ్‌ వైరసే అని వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో చికిత్స పొందిన పాజిటివ్‌ వ్యక్తుల్లో వైరస్‌ అవశేషాలు 1-3 నెలల పాటు ఉండే అవకాశముందని చెబుతున్నారు. గతంలో ఇలాంటి వ్యక్తులకు చాలా మందికి నెలల పాటు వైద్యం అందించినట్లు వైద్యులు తెలిపారు. ఇక.. స్వల్ప లక్షణాలున్న పాజిటివ్‌ పేషెంట్లు 14 రోజుల పాటు ఇంట్లోనే విడిగా ఉంటే సరిపోతుందని, ఆ తరువాత వారు తమ దైనందినకార్యక్రమాలను నిర్భయంగా నిర్వహించుకోవచ్చునని చెబుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, కాలేయ, మూత్రపిండవ్యాధుల వంటివి(కోమార్బిడిటీస్‌) ఉన్నవారుమాత్రం తప్పనిసరిగా 21 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వారు కరోనాకు చికిత్స పొందుతూనే తమకున్న అనారోగ్యాలకు సంబంధించిన మందులను వైద్యుల సలహా మేరకు ఆపకుండా వాడాలని సూచిస్తున్నారు.


కోమార్బిడిటిస్‌ ఉంటే 21 రోజుల ఐసోలేషన్‌ తప్పనిసరి

అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగాల వంటివాటితో బాధపడేవారికి పాజిటివ్‌ వస్తే వారు 21రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిందే. వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలి. కొవిడ్‌-19 కారణంగా ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తున్న వారిలో ఎక్కువ మంది ఇలాంటివారే ఉంటున్నారు. వీరికి 7-10 రోజుల పాటు చికిత్స ఇచ్చి ఇంటికి పంపిస్తారు. 21 రోజుల తర్వాత మరోసారి నమూనాలు ఇచ్చి వైరస్‌ తీవ్రత ఏ మేరకు ఉందో నిర్ధారించుకోవాలి. వైరస్‌ ఇంకా యాక్టివ్‌గా ఉంటే మరో వారం రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. నెగిటివ్‌ వస్తే హోం ఐసోలేషన్‌ అవసరం ఉం డదు. పాజటివ్‌ వస్తే చికిత్స చేయించుకుని మరో వారం రోజుల తరువాత అంటే 28 రోజుల తరువాత మళ్లీ పరీక్ష చేయించాలి. అప్పుడు పాజిటివ్‌ వచ్చినా ఐసోలేషన్‌ అవసరం లేదు. సాధారణ జీవనం గడుపొచ్చు. ఆఫీసుకు వెళ్లొచ్చు.

డాక్టర్‌ గోపీచంద్‌ మన్నం, ఎండి, స్టార్‌ ఆస్పత్రి


పాజిటివ్‌గా నిర్ధారణ అయినా ఏం కాదు

కరోనా వైరస్‌ లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చినవారికి 14 రోజుల హోం ఐసోలేషన్‌ సరిపోతుంది. 2 వారాల తర్వాత వారు మళ్లీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. 17రోజుల తరువాత పనులు చేసుకోవచ్చు. 14-17 రోజుల మధ్య పరీక్ష చేయించుకున్నప్పటికీ కొందరిలో పాజిటివ్‌ రావచ్చు. అప్పుడు వారి శరీరంలో ఉండేది డెడ్‌ వైరస్‌. అది శరీరంలో 2, 3 నెలలు ఉన్నా ఎవరికీముప్పు ఉండదు. పాజిటివ్‌గా తేలినవారిలో 14 రోజల తర్వాత ఆయాసం, దగ్గు, జలుబు, జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి చూసే శక్తిని, వాసన చూసే శక్తిని కోల్పోవడం.. వంటి లక్షణాల్లో ఏది కనిపించినా మరో వారం రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. 14 రోజుల తరువాత పాజిటివ్‌ వస్తే వైరల్‌ లోడ్‌ చూస్తాం. ఎక్కువగా ఉంటే హోం ఐసోలేషన్‌ సిఫారసు చేస్తాం.

డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌, సూపరింటెండెంట్‌, రాష్ట్ర ఛాతీవ్యాధుల ఆస్పత్రి
ఎప్పటిలాగానే పనులు చేసుకోవచ్చు

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి, ఓ మోస్తరు లక్షణాలున్న వారు ఇంట్లో నే 17 రోజుల క్వారంటైన్‌లో ఉండడం మంచిది. ఎలాం టి లక్షణాలు లేకున్నా.. బయటికెళ్లి, ఇతరులతో సన్నిహితంగా ఉండడం శ్రేయస్కరం కాదు. పాజిటివ్‌ వచ్చిన 18వ రోజు నుంచి వారు ఎప్పటిలాగానే అన్ని పనులూ చేసుకోవచ్చు. పాజిటివ్స్‌ 17 రోజుల ఐసోలేషన్‌ లో ఉన్నాక వారి శరీరంలో వైరస్‌ జాడ ఉన్నా, దాని శక్తి తగ్గిపోతుంది. ఇతరులకు సోకదు. ఆ సమయంలో మరోసారి నిర్ధారణ కోసం కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు.

 డాక్టర్‌ విష్ణురావు, ఇన్‌ఫెక్షన్‌ డిసీజస్‌, అపోలో ఆస్పత్రి


10 రోజులే చురుకు!

కరోనా పాజిటివ్స్‌లో లక్షణాలేవీ కనిపించకపోతే వారం, 10 రోజుల హోం ఐసోలేషన్‌ సరిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే వారం రోజు లే సరిపోతుందని చెబుతోంది. 10రోజుల తరువాత ఆ వైరస్‌ ఇతరులకు వ్యాపించే చురుకుదనాన్ని కొల్పోతుంది. వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన అసింప్టమాటిక్‌ పేషెంట్లకు 10 రోజుల తరువాత మళ్లీ నిర్ధారణ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. కొం దరిలో నాలుగైదు రోజల వరకే కరోనా లక్షణాలు కనిపించి ఆ తరువాత తగ్గిపోతాయి. కొందరి శరీరంలో వైరస్‌ 28 రోజుల పాటు ఉండే అవకాశముంది. అలాంటి వారిలో దగ్గు, తుమ్ములు లేకపోతే ఎలాంటి ముప్పు ఉండదు.

డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆస్పత్రి

Updated Date - 2020-07-22T08:46:44+05:30 IST