తెలంగాణలో కలవరపెడుతున్న కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-06-02T02:27:56+05:30 IST

కరోనా మహమ్మారి దడ పుట్టిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 94 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో కలవరపెడుతున్న కరోనా మరణాలు

హైదరాబాద్: కరోనా మహమ్మారి దడ పుట్టిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో  సోమవారం కొత్తగా 94 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు నమోదైన 94 కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,792కి చేరింది. కరోనా వల్ల ఈ రోజు ఆరుగురు మృతి చెందారు. దీంతో కరోనా మరణాలు 88కి చేరాయి. కరోనా కారణంగా ఆదివారం కూడా ఐదుగురు చనిపోయారు. అయితే మరణాల సంఖ్య కలవరపెడుతోంది.


ఎప్పట్లాగే అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 79 మందికి కరోనా సోకింది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గ్రేటర్‌లో ఎక్కువగా ఉన్నాయి. రంగారెడ్డిలో 3, మేడ్చల్‌లో 3, మెదక్‌, నల్గొండ, సంగారెడ్డిలో రెండేసి కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్‌లో, పెద్దపల్లిలో, జనగాంలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇప్పటి వరకు 1,491 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 1,213 యాక్టివ్‌ కేసులున్నాయి. లాక్‌డౌన్ సడలించడంతో కేసుల సంఖ్య పెరుగుతున్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. గత నెలలతో పోల్చితే మే నెల ప్రారంభం నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. మే 31న అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయి. జూన్, జులై నెలల్లో కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2020-06-02T02:27:56+05:30 IST