కరోనా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-03-21T10:29:50+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ముందే జిల్లా ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలతోపాటు సినిమాహాళ్లు, ఫంక్షన్‌హాళ్లు, పార్కులు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, మాల్స్‌, ప్రార్థనా మందిరాల మూసివేతతో జనం

కరోనా కర్ఫ్యూ

నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు

పెరిగిన అవగాహన.. జాగ్రత్తల్లో జనం

విదేశాలే కాదు పొరుగురాష్ట్రాలైనా..!

‘హౌజ్‌ ఐసోలేషన్‌’లోమరో 43 మంది


మహబూబాబాద్‌, ఆంధ్రజ్యోతి : ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ముందే జిల్లా ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలతోపాటు సినిమాహాళ్లు, ఫంక్షన్‌హాళ్లు, పార్కులు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, మాల్స్‌, ప్రార్థనా మందిరాల మూసివేతతో జనం తొలిరోజు రోడ్లపై కిక్కిరిసిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఎలకా్ట్రనిక్‌, ప్రింట్‌, సోషల్‌ మీడియాల్లో వస్తున్న కథనాలకు అంతా అప్రమత్తమైపోతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దన్న వైద్యవర్గాల సూచనలను పాటించడం ఆరంభించారు. రెండోసారి కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్‌ మరిన్ని నిర్ణయాలు తీసుకున్న మరునాడు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారుల్లో జన సంచారం తగ్గిపోయింది.


అప్రకటిత కర్ఫ్యూను తలపించేలా జిల్లా కేంద్రంలోని ముఖ్యకూడళ్లు జనం లేక వెలవెలబోయాయి. పోలీసు యంత్రాంగం సైతం సైరన్‌ మోగిస్తూ వాహనాలను తిప్పుతూ కరోనా వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని జనం గుమికూడి కనిపించవద్దని హెచ్చరికలు చేస్తుండడంతో రోడ్లపైనే కాదు సందుగొందులు సైతం నిర్మానుష్యంగా కనిపించాయి. దీనికితోడు ఉష్టోగ్రతలు 34 డిగ్రీలకు చేరుకోవడంతో సాధారణ జనం సైతం రోడ్ల మీదకు రావడానికి వెనుకాడారు. 


నిత్యావసరాలతో పాటే మాస్కులు.. 

కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తతతో కూడిన హెచ్చరికలు, చర్యల నేపఽథ్యంలో నిత్యావసర వస్తువులతోపాటు మాస్కులకు డిమాండ్‌ వచ్చేసింది. అందులోనూ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ కోసం భారత ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో ముందస్తుగానే ప్రజలు అప్రమత్తమయ్యారు. విద్యాసంస్థలకు సెలవులతోపాటు ఇంటర్‌ పరీక్షలు అయిపోవడం పదో తరగతి పరీక్షలను సోమవారం నుంచి వాయిదా వేయాలని కోర్టు సూచనలతో గృహస్తులు నిత్యావసర  సరుకులను తెప్పించుకునేందుకు ఆసక్తి కనబర్చారు.


శనివారం మార్కెట్లో రద్దీ తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో ఒకరోజు ముందే కిరాణాషాపులు, సూపర్‌ మార్కెట్లలో కావాల్సిన అల్పాహార, తినుబండారాల సరుకులను తెప్పించుకున్నారు. నిత్యావసరాల కొరత రానీయమని, భయపడి కొనుగోళ్లు చేసుకోవద్దని ప్రధాని ప్రకటించినప్పటికీ మరికొందరైతే ఎందుకైనా మంచిదని సాధారణంగా తీసుకునే సరుకులకు రెండింతలు కొనుగోలు చేసుకొని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక రోడ్లపై మాస్క్‌ల దుకాణాలు వెలిశాయి. ప్రతీ ఒక్కరు మాస్క్‌లను కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి చూపించారు. మార్కెట్లో సానిటైజర్ల కొరత కనిపించింది. అధిక రేట్లకు విక్రయించవద్దన్న మెడికల్‌ డ్రగ్గిస్ట్‌ అధికారుల హెచ్చరికలతో పలువురు వీటి అమ్మకాలను పక్కన పెట్టారు. 


43 మంది ఇంటికే పరిమితం...

జిల్లా వ్యాప్తంగా ఒక్క శుక్రవారం నాడే విదేశాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు చేరిన 43 మందికి వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించి హౌజ్‌ ఐసోలేషన్‌కు ఆదేశాలిచ్చారు. విదేశాలకు వెళ్లి వచ్చి గోప్యంగా ఇల్లు చేరిన వారి సమాచారం ఆయా విమానాశ్రయాల ఇమిగ్రేషన్‌ జాబితా తెప్పించుకున్న అధికార యంత్రాంగం విదేశాల నుంచి స్వగృహాలకు వచ్చిన వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టింది. ఆస్ట్రేలియా నుంచి డోర్నకల్‌కు వచ్చిన ఇద్దరిని, ఈజిప్ట్‌ నుంచి మన్నేగూడానికి వచ్చిన ఒకరిని, కెనడా నుంచి గూడూరుకు, దుబాయ్‌ నుంచి ఉప్పరపల్లి, కాట్రపల్లి గ్రామాలకు, ఉగాండా నుంచి కల్వలకు, అమెరికా నుంచి కేసముద్రం స్టేషన్‌కు వచ్చిన వారిని గుర్తించి ఆయా మండలాల రెవెన్యూ అధికారులు, పోలీసులు, వైద్యుల సహకారంతో కౌన్సెలింగ్‌ చేపట్టారు.


ఇల్లు విడిచి 14 రోజులపాటు బయటకు వెళ్లవద్దని సూచనలు చేశారు. అదే రీతిన దుబాయ్‌ నుంచి దాట్లకు, అమెరికా నుంచి గున్నెపల్లికి, పెద్దముప్పారానికి, లండన్‌ నుంచి మహబూబాబాద్‌ పట్టణానికి దుబాయ్‌ నుంచి మాటేడుకు, యూకే నుంచి మానుకోటకు వచ్చిన వారి గృహాలకు వెళ్లి హౌజ్‌ ఐసోలేషన్‌కు ఆదేశాలిచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారిని విమానాశ్రయాలకు వెళ్లి రిసీవ్‌ చేసుకొని వచ్చిన వారిని కూడా హౌజ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారేకాకుండా వారితో సన్నిహితంగా తిరిగిన వారికి కూడా వివిధ పరీక్షలు నిర్వహించారు. పొరుగు రాష్ట్రాలైన గుజరాత్‌, మహారాష్ట్రలోని భీమండి, సూరత్‌, ముంబై నుంచి వచ్చిన 15 మందికి ఇటీవలె గోవా టూర్‌కు వెళ్లి వచ్చిన 28 మందికి జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు. 

Updated Date - 2020-03-21T10:29:50+05:30 IST