కరోనాలోనూ బెంచ్‌లన్నీ పనిచేశాయి

ABN , First Publish Date - 2020-08-16T09:45:09+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ ఒక్క తెలంగాణ హైకోర్టులో ..

కరోనాలోనూ బెంచ్‌లన్నీ పనిచేశాయి

  • తెలంగాణ హైకోర్టులోనే పూర్తి స్థాయిలో విధులు
  • కోర్టు సిబ్బందికి కరోనా బీమా వర్తింపు: సీజే

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ ఒక్క తెలంగాణ హైకోర్టులో మాత్రమే 9 బెంచ్‌లు పనిచేశాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు ఆవరణలో శనివారం ఆయన పతాకాన్ని ఆవిష్కరించారు. గడిచిన 5 నెలలుగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరోనా మహమ్మారి కారణంగా పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఒక్క తెలంగాణ హైకోర్టు మాత్రమే పూర్తి స్థాయిలో విధులు నిర్వహించిందని, ఇదెలా సాధ్యమైందంటూ దేశంలోని మిగిలిన హైకోర్టుల సీజేలు తనకు ఫోన్లు చేస్తున్నారన్నారు.


ఇదంతా న్యాయవాదులు, కోర్టు ఉద్యోగుల సహకారం వల్లే సాధ్యమైందని చెప్పారు. న్యాయవాదులు, న్యాయవాద క్లర్కుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు సాయం ప్రకటించిందని, ఇప్పటికే 15 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. కరోనా బారినపడ్డ  న్యాయవాదులు, న్యాయవాద క్లర్కులు, వారి కుటుంబ సభ్యులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం 3 ఆసుపత్రులు కేటాయించినందుకు సంతోషంగా ఉందన్నారు. హైకోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సహా అందరికీ కరోనా బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 2,119 మంది సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.2.5 లక్షల చొప్పున బీమా చేసినట్లు తెలిపారు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ సౌకర్యం లేని న్యాయవాదుల కోసం దేశంలో మొదటిసారిగా మొబైల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ వ్యాన్‌ ఏర్పాటు చేశామని సీజే చెప్పారు.  


వీడియో కాన్ఫరెన్సు మొబైల్‌ కోర్టు ప్రారంభం

ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జ్యుడీషియల్‌ జిల్లాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సు సౌకర్యం గల మొబైల్‌  కోర్టు వాహనాలకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. తొలుత  వరంగల్‌ జిల్లాలో జూన్‌ 29న దీన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 10 జ్యుడీషియల్‌ జిల్లాలకుగాను 5 జిల్లాల్లో మొబైల్‌ వీడియో కాన్ఫరెన్సు కోర్టులు ప్రారంభించినట్లయింది.

Updated Date - 2020-08-16T09:45:09+05:30 IST