కాంగ్రెస్‌ కార్యక్రమాలకు కరోనా కళ్లెం!

ABN , First Publish Date - 2020-06-25T08:53:50+05:30 IST

కాంగ్రెస్‌ కార్య్రకమాలకు కరోనా వైరస్‌ కళ్లెం వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలనుకుంటున్న

కాంగ్రెస్‌ కార్యక్రమాలకు కరోనా కళ్లెం!

నేతలకు వైరస్‌ సోకుతుండటంతో వెనక్కు

పత్రికా ప్రకటనలకు పరిమితమవుతున్న నాయకులు


హైదరాబాద్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ కార్య్రకమాలకు కరోనా వైరస్‌ కళ్లెం వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలనుకుంటున్న ఆ పార్టీ నేతలకు వైరస్‌ సోకుతోంది. దాంతో పలువురు నాయకులు పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారు.  ఒక వైపు కరెంటు బిల్లుల మోత, మరో వైపు కరోనా కేసుల పెరుగుదల. ఇంకో వైపున పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని మరింత పెంచాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంపై పెరుగుతున్న అప్పుల భారం.. తగ్గుతున్న ఆదాయం. ఇలా... ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్న మరెన్నో సమస్యలపై కార్యక్రమాలను చేపట్టాలని టీపీసీసీ ఇప్పటికే నిర్ణయించింది. వరుస కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించింది.  ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తమయ్యారు. అయితే కాంగ్రెస్‌ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. పార్టీ ముఖ్యనేతలే వైరస్‌ బారిన పడి ఆసుపత్రుల పాలు కావడంతో పార్టీ నాయకత్వం అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో  ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిందని టీపీసీసీ భావిస్తోంది.


ఇదే అదనుగా ఆయా అంశాలపై కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదులపై పెండింగ్‌ ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమాలను నిర్దేశించుకుంది. అయితే కొవిడ్‌ నిబంధనల మేరకు పార్టీ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై టీపీసీసీ కోర్టుకు వెళ్లింది. కోర్టులో కేసు ఎటు తేలుతుందన్నది పక్కన పెడితే.. ఇటీవలి కాలంలో పార్టీ తలపెట్టిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న సీనియర్‌ నేతలు వి. హన్మంతరావు, గూడూరు నారాయణరెడ్డిలకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. వారు ప్రస్తుతం ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరి ద్వారా ఇంకెవరికైనా వైరస్‌ సోకిందా అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో  వ్యక్తమవుతోంది. కార్యకర్తలు, నేతలు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సూచించారు. కరెంటు బిల్లులు, ఇంటి పన్ను, నీటి బిల్లులు రద్దు చేయాలని, రూ. 15 వేల వరకు ఇంటి అద్దెలను యజమానులకు ప్రభుత్వమే చెల్లించాలన్న డిమాండ్లతో తన నివాసం వద్ద దీక్ష చేపట్టాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి  నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లనూ చేసుకున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ఆయన కొద్ది రోజులు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సమస్యలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలను తలపెట్టిన టీపీసీసీ నేతలు.. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా ప్రకటనలు,  ట్వీట్లతో   ప్రస్తుతానికి సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

Updated Date - 2020-06-25T08:53:50+05:30 IST