కరోనాపై భయం వద్దు

ABN , First Publish Date - 2020-03-15T09:06:51+05:30 IST

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వెర్రిబాగుల వాళ్ల మాదిరిగా ఉండలేమని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోతే పొరపాటవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

కరోనాపై భయం వద్దు

ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నాం..

5 వేల కోట్లయినా ఖర్చు పెడతాం

ఉత్పాతమున్నప్పుడు ప్రేక్షక పాత్ర పోషించలేం

 దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెసే: కేసీఆర్‌

వైరస్‌ శాసనసభలో  లఘు చర్చ

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వెర్రిబాగుల వాళ్ల మాదిరిగా ఉండలేమని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోతే పొరపాటవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇప్పటికే క్వారంటైన్‌ గదులను సిద్ధం చేశామని చెప్పారు. మాస్కులు, సూట్‌లు ఎన్ని ఉన్నాయో ఆరా తీయాలని, ఎక్కడికీ పంపకుండా సీజ్‌ చేయాలని అధికారులను పురమాయించామన్నారు. దేశంలో ఇప్పటివరకు ఇద్దరే చనిపోయారని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. మంత్రులు, అధికారులు, కలెక్టర్ల సూచనలను ప్రజలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కరోనా వ్యాప్తిపై  శాసనసభలో శనివారం లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వివరించిన అంశాలు ఆయన మాటల్లోనే..


దేశంలో వైరస్‌ సోకినవారు 65 మందే

కరోనా గురించి ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 10, 12 రోజులుగా ఆయన, హెల్త్‌ సెక్రటరీ రోజువారీ సమీక్షలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిణామాలను బేరీజు వేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో వైరస్‌ సోకినవాళ్ల సంఖ్య 65. ఇందులో విదేశీయులు 17 మంది, మిగతావారు మన దేశస్థులు. వీరిలో 10 మందిని డిశ్చార్జి కూడా చేశారు. మన రాష్ట్రంలో కూడా గాంధీ ఆస్పత్రిలో ఒక వ్యక్తికి వ్యాధిని నయం చేసి డిశ్చార్జి చేశారు. కారణాలేవైనా ఇలాంటి వైర్‌సలు ప్రతి 75 ఏళ్లకోసారి బ్రేక్‌ అయి   ప్రపంచాన్ని గడగడలాడిస్తాయి. కరోనా భారత్‌లో పుట్టిన వ్యాధి కాదు. ముంబయి డాక్‌యార్డ్‌ నుంచి విస్తరించిందని తేలింది. అంతర్జాతీయ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల నుంచే విస్తరిస్తుంటుంది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం లేదని, మనం సేఫ్‌ అని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చెప్పారు. కానీ, ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఈ రోజు పాజిటివ్‌ అని తేలింది. అతడికి గాంధీలో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్న మరో ఇద్దరి నమూనాలను పుణె పంపారు. వీరంతా విదేశాల నుంచి వచ్చినవాళ్లే. ఇలాంటి ఉత్పాత స్థితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండలేం. ఉంటే అది క్రైమ్‌ అవుతుంది. 


హైదరాబాద్‌కు అంతర్జాతీయ కనెక్టివిటీ తో..

హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ ఇంటర్నేషనల్‌ కనెక్టివిటీ బాగా పెరిగింది. అందుకే ఈ వ్యాధి ప్రపంచంలో ఫలానా దేశానికి పరిమితమైందని చెప్పలేం. కరోనా తీవ్రంగా ఉన్న ఏడు దేశాల నుంచి ప్రయాణికులను మన దేశంలోకి అనుమతించవద్దంటూ కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.  వచ్చినవారిని వచ్చినట్లు స్ర్కీనింగ్‌ చేయడానికి 200 మంది ఆరోగ్య సిబ్బందిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పెట్టాం. అక్కడ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా పని చేస్తోంది. ఇప్పటికైతే ఉత్పాతమేమీ వచ్చి పడలేదు. ప్రజలను భయోత్పాతానికి గురి చేయకుండా... నిదానంగా తెలుసుకుని పొరుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? మనమేం చేయాలన్నదానిపై చర్యలు మొదలుపెట్టాం. మొన్న మాట వరసకు రూ.వెయ్యి కోట్లని చెప్పాను. అవసరమైతే, అన్నింటినీ స్తంభింపజేసి రూ.5 వేల కోట్లయినా ఖర్చు పెడతాం. కొందరు మిత్రులు ప్రతిదాన్నీ రాజకీయం చేయాలని చూస్తారు. అది వాళ్ల ఖర్మ. 


రాజస్థాన్‌నూ బద్‌నాం చేస్తామా?

కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ మాట్లాడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన కామెంట్‌. కేంద్ర ప్రభుత్వం అసంఖ్యాకంగా చర్యలు చేపట్టింది. అపోజిషన్‌ బెంచీలో ఏదైనా మస్తుగా అడ్డం, పొడుగు మాట్లాడొచ్చు. నోరుంది కదాని మాట్లాడటం కాదు. సమాజాన్ని భయభ్రాంతం చేయొద్దని చెబుతున్నాం. విదేశాల నుంచి మనుషులు వస్తే క్వారంటైన్‌కు కొన్ని ప్రత్యేక ప్రదేశాలు వెతికిపెట్టాం. దూలపల్లిలోని ఫారెస్ట్‌ అకాడమీలో 150 గదులు, వికారాబాద్‌ హరిత హోటల్‌లో 30 సూట్స్‌ ఉన్నాయి. వాహనాలు తదితర వాటిని సిద్ధంగా ఉంచాం. ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా, మీ పార్టీ(కాంగ్రెస్‌) అధికారంలో ఉన్న పంజాబ్‌, రాజస్థాన్‌లో కూడా చర్యలు తీసుకుంటున్నారు. రాజస్థాన్‌లో ఇద్దరు చనిపోయారని, ఆ ప్రభుత్వాన్ని బద్‌నాం చేద్దామా? మన దేశంలోనే పెద్ద క్యాజువాలిటీ లేదు. అమెరికాలో ఎమర్జెన్సీ డిక్లేర్‌ చేశారు. మన దేశం అదృష్టవంతమైంది. అక్కడి పరిస్థితి ఇక్కడ లేదు. నేను కూడా కేంద్రంతో మాట్లాడుతున్నా. రాష్ట్ర ప్రజలకు ఏది మంచో అది చేస్తాం. నేను, ఆరోగ్య మంత్రి, అన్ని జిల్లాల మంత్రులు, కలెక్టర్లు అప్పీల్‌ చేస్తారు. ప్రభుత్వం, చీఫ్‌ సెక్రటరీ, కలెక్టర్లు ఇచ్చే ఆదేశాలను తప్పకుండా ప్రజలు పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. 


వారం తర్వాతే ఆలోచన

రాష్ట్రంలో వారం తర్వాతకరోనా పాజిటివ్‌ కేసుల నమోదు కాకపోతేనే ఆంక్షల ఎత్తివేతపై ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అప్పటి వరకు రోజువారీ సమీక్షలతో అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. శనివారం రాత్రి  ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కేవలం కరోనా ఎజెండాగా ఈ భేటీ మూడు గంటల పాటు సాగింది. ప్రధానంగా కేసులు సంఖ్య పెరిగితే ఏం చేయాలి? వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలి? మన దగ్గరున్న సౌకర్యాలేంటి? అన్న దానిపై సమగ్రంగా చర్చించారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ, మండలి సమావేశాలను సోమవారంతో ముగించాలని నిర్ణయానికి వచ్చారు.  దీనిపై  ఆదివారం సభలో స్పీకర్‌ ప్రకటన  చేయనున్నారని సమాచారం. ఇటలీ నుంచి వచ్చిన ఓ యువతికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని సీఎం కేసీఆరే సభలో వెల్లడించగా, మిగిలిన రెండు అనుమానిత కేసులు కూడా విదేశాల నుంచి వచ్చినవేనని కేబినెట్‌లో ప్రస్తావించారు. వారి నమూనాలను ఇప్పటికే పుణెకు పంపామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కేబినెట్‌ దృష్టికి తెచ్చారు. విదేశాల నుంచి వచ్చే వారిలో కొందరు ఇతర ఎయిర్‌పోర్ట్‌లలో దిగి బస్సులు, రైళ్ల ద్వారా హైదరాబాద్‌ చేరుకుంటున్నారని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కాగా వివిధ శాఖలను కూడా సమావేశానికి పిలిచిన సీఎం కేసీఆర్‌, క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణను చూసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. 


సైంటిస్టు  మాటగా  చెప్పాను

నేను మొన్న మాట్లాడుతూ.. భయోత్పాతానికి గురి కావాల్సిన అవసరం లేదు. సర్టేన్‌ డిగ్రీస్‌ తర్వాత ఈ వైరస్‌ బతకదు. ఒకవేళ ఎవరికైనా అనుమానముంటే... దీనికి ఇప్పటివరకు మందు లేదు. దీని ద్వారా వచ్చే జ్వరానికి మామూలు పారాసిటమల్‌ వేసుకుంటే ఇది కూడా గట్లనే పోతదంటూ ఒక సైంటిస్టు చెప్పాడని అన్నాను. అయామ్‌ ఆన్‌ రికార్డ్‌. ఒక సైంటిస్టు ఫోన్‌ చేసి చెప్పిండు అని చెప్పిన. దాన్ని తీసుకుని, అదేదో గొప్ప విషయమని, ఇంతకంటే గొప్పది లేదన్నట్లుగా.. భట్టి విక్రమార్క మాట్లాడే ప్రయత్నం చేశాడు. అసలు ఈ దేశానికి పట్టిన భయంకరమైన కరోనానే ఈ కాంగ్రెస్‌ పార్టీ. ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందో తెలియదు. 

Updated Date - 2020-03-15T09:06:51+05:30 IST