పల్లెకు బుగులు

ABN , First Publish Date - 2020-05-10T09:01:06+05:30 IST

ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు పనులు చేసుకునేందుకు రాష్ట్రానికి తరలివస్తున్నారు.

పల్లెకు బుగులు

తిరిగొచ్చిన కూలీల నుంచి కరోనా ముప్పుపై ఆందోళన

ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు కూలీలు

బయట నుంచి కూడా తిరుగు వలసలు

వారందరికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలతో సరి

జ్వరం ఉంటే తప్ప ఆ పరీక్షలో బయటపడదు

లక్షణాలు ఉన్న కూలీలు హోం క్వారంటైన్‌కు

చిన్న గదులు, గుడారాల్లో క్వారంటైన్‌ ఎలా?

పట్నం లెక్కనే పల్లెలూ సురక్షితం కావా? 

మాకు కరోనా వస్తే ఏంటి పరిస్థితి? 

కూలీలను అడ్డుకుంటున్న పల్లె వాసులు


హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు పనులు చేసుకునేందుకు రాష్ట్రానికి తరలివస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకుంటాయన్న కోణంలో ఈ పరిణామం సంతోషానిచ్చేదే అయినా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉండటంతో ఈ మహమ్మారి అదుపులోనే ఉందన్న అభిప్రాయాలున్నాయి. ఈ తరుణంలో వలస వెళ్లిన కూలీల రాక, తిరుగు వలసలు పల్లె ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే అది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్న ముంబై వంటి ప్రాంతాల నుంచి కూలీలు ఎక్కువగా వస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కరోనా సోకితే కొందరికి 14 రోజుల నుంచి 28 రోజులదాకా  లక్షణాలు బయటపడవు అని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బయటి రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీలకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేస్తున్నారు. జ్వరం ఉంటే తప్ప ఈ పరీక్షలో లక్షణాలు బయటపడవు. అలాంటప్పుడు థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఏ మేరకు ఔచిత్యం అని   ప్రశ్నిస్తున్నారు. జ్వరం లక్షణాలున్న కూలీలను 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచాలనే మార్గదర్శకాలను అధికారులు పాటిస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కూలీలను పరీక్షిస్తున్నారు. ఏ మాత్రం లక్షణాలు ఉన్నా, ఇంట్లో నుంచి కదలరాదని స్పష్టం చేస్తున్నారు. వచ్చిన పేదలంతా  ఒకట్రెండు గదుల్లో, గుడారాల్లో నివాసం ఉండేవారే. వైరస్‌ లక్షణాలు ఉన్నవారిని ఇరుకు ప్రదేశంలో హోం క్వారంటైన్‌ చేయడం ఎలా సాధ్యమవుతుంది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు దాదాపు లేకపోవడంతో మళ్లీ వైరస్‌ విజృంభణకు బీజం పడినట్లు అవ్వదు కదా? అని భయపడుతున్నారు. 


జిల్లాల్లో ఇప్పుడున్న పరిస్థితి ఉంటుందా? 

 తెలంగాణలో మూడు జిల్లాల్లో ఆది నుంచే కేసుల్లేవు. వరంగల్‌ రూరల్‌, యాదాద్రి, వనపర్తి జిల్లాలు కేసుల్లేని జిల్లాలుగా గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. గత 14 రోజులుగా 22 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. ఈ జిల్లాలు ఆరేంజ్‌ జోన్‌లో ఉన్నాయి.  కరీంనగర్‌ వంటి జిల్లాల్లో కరోనా కేసులు వచ్చీరాగానే కట్టడి చర్యలు తీసుకన్నారు. లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో జిల్లాల్లో కరోనా వ్యాప్తి లేదు.  దేశంలో 90శాతం దాకా కేసులు మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, న్యూఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనే ఉండటం, అక్కడి నుంచే రాష్ట్రానికి  కూలీలు చేరుకుంటుండటంతో యంత్రాంగానికి కునుకులేకుండా పోతోంది. ఇటీవల మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌కు బస్సులో కూలీలు తిరిగి రాగా వారిలో 6 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. విదేశాల నుంచి  ప్రవాసీయులను రప్పిస్తుండటంతో వారిలో కూడా కొవిడ్‌-19 లక్షణాలు బయటపడుతున్నాయి. ఇలా కేరళకు వచ్చిన ఇద్దరికి కరోనా ఉన్నట్లు శనివారం నిర్ధారించారు. ఈ పరిణామాలు  అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పల్లెలే సురక్షితమని, పట్నం నుంచి ఎప్పుడో అక్కడికి చేరుకొని దిలాసాగా ఉన్న ప్రజలను కూడా ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా జిల్లాల్లో వలస కూలీలు, కార్మికుల వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా  త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు వేసుకొని పర్యవేక్షిస్తున్నారు. వైద్యుల బృందంతో రోజుకు మూడుసార్లు వీరికి పరీక్షలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-05-10T09:01:06+05:30 IST