కరోనాపై వాట్సాప్ చాట్ బోట్
ABN , First Publish Date - 2020-04-07T09:12:55+05:30 IST
కరోనా మహమ్మారిపై సమరానికి వాట్సాప్ కూడా సిద్ధమైంది. ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ కలిసి పనిచేయనుంది. కరోనాపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం

- వైరస్‌పై ఎప్పటికప్పుడు సమాచారం
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిపై సమరానికి వాట్సాప్ కూడా సిద్ధమైంది. ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ కలిసి పనిచేయనుంది. కరోనాపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో వాట్సాప్ తన వినియోగదారులకు ప్రత్యేకంగా ‘చాట్ బోట్’ను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ దీన్ని ప్రారంభించారు. లాక్‌డౌన్‌ను గౌరవిస్తూ ప్రజలంతా ఇంటి వద్దనే ఉండాలని, అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలని చాట్‌బోట్‌ను ఆవిష్కరిస్తూ అన్నారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ మాట్లాడుతూ కరోనాకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే చాట్‌బోట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు. చాట్‌బోట్ సేవలకు +91-90006 58658 నంబరుకి ‘హాయ్’/‘హలో’ /‘కొవిడ్’ అని ఇంగ్లి్‌షలో సందేశం పంపిస్తే చాట్‌బోట్ యాక్టివేట్ అవుతుంది.
ఈ సమాచారం తెలుసుకోవచ్చు.. 1. కొవిడ్-19 ప్రస్తుత పరిస్థితి; 2. కరోనా వైరస్ గురించి; 3. ఆరోగ్య కేంద్రాలు/ఐసోలేషన్ కేంద్రాలు; 4. ప్రభుత్వ అధికారిక సమాచారం; 5. లాక్‌డౌన్ సంబంధిత సమాచారం; 6. వదంతులు, తప్పుడు సమాచార నియంత్రణ; 7. జీహెచ్‌ఎంసీ ఉచిత భోజన కేంద్రాలు; 8. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు; 9. ఇతరులతో పంచుకోండి; 10. తాజా పత్రికా ప్రకటన.