తెలంగాణలో ర్యాండమ్ టెస్టులు అవసరంలేదు: మంత్రి ఈటల
ABN , First Publish Date - 2020-04-29T00:56:41+05:30 IST
తెలంగాణలో ఎక్కడా ర్యాపిడ్ టెస్టులు చేయలేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు చేయబోమని..

హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా ర్యాపిడ్ టెస్టులు చేయలేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు చేయబోమని సీఎం చెప్పారని ఆయన తెలిపారు. ప్రైవేటుకు అప్పగిస్తే ప్రజల జేబు గుల్ల అవుతుందన్నారు. అందుకే తెలంగాణలో ప్రైవేటు ల్యాబ్‌లకు టెస్టులు ఇవ్వమని తేల్చి చెప్పారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో టెస్టులు చేయించేదిలేదన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు.
తెలంగాణలో కరోనా కేసులను దాచిపెట్టలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా మరణాలు 2.5శాతమేనన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో తెలంగాణ ముందుందని చెప్పారు. తెలంగాణలో 25మంది చనిపోతే ఇద్దరు గుల్బర్గా, ఒకరు ఏపీకి చెందినవారన్నారు. రెండు గుల్బర్గా కేసులు తెలంగాణలో ఖాతాలో వేసుకున్నామని పేర్కొన్నారు. చనిపోయినవారిలో చాలామంది 60 ఏళ్లకు పైబడినవారేనని ఈటల పేర్కొన్నారు.
‘‘కరోనా నివారణలో తెలంగాణకు కరీంనగర్ ఆదర్శం. దేశానికి తెలంగాణ ఆదర్శం. మర్కజ్ వెళ్లి వచ్చినవారిని అతితక్కువ కాలంలో గుర్తించాం. తెలంగాణలో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నాం. రాష్ట్ర సరిహద్దుల్లోనూ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం. తెలంగాణ మహమ్మారి నుంచి రాష్ట్రం తొందరలో బయటపడాలి. సింటమ్స్ ఉన్నవారందరికీ టెస్టులు నిర్వహిస్తాం. మే 8 వరకు కరోనా ఫ్రీగా తెలంగాణ అవతరిస్తుందని ఆశిస్తున్నాం. తెలంగాణ జనజీవనం సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నాం. తెలంగాణలో ర్యాండమ్ టెస్టులు అవసరంలేదు.’’ అని మంత్రి ఈటల తెలిపారు.