44 కుటుంబాల నుంచే 25% కేసులు
ABN , First Publish Date - 2020-04-25T09:16:42+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 983కు చేరుకుంది. అందులో దాదాపు సగం కేసులు కేవలం 113 కుటుంబాల నుంచే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

4 జిల్లాలు.. 113 కుటుంబాలు.. 434 పాజిటివ్‌లు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 983కు చేరుకుంది. అందులో దాదాపు సగం కేసులు కేవలం 113 కుటుంబాల నుంచే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ కుటుంబాల నుంచి 434 కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరిశీలనలో వెల్లడైంది. తెలంగాణలో ప్రఽధానంగా నాలుగు జిల్లాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగం హైదరాబాద్, సూర్యాపేట, జోగులాంబ-గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో నమోదైనవే.
హైదరాబాద్‌లో అయితే.. రోజూ పదికి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో.. హైదరాబాద్‌లోని 44 కుటుంబాల ద్వారా వ్యాప్తి చెందినవే 25 శాతం. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 485 కేసులు నమోదు కాగా.. ఆ 44 కుటుంబాల నుంచి వచ్చిన పాజిటివ్‌ల సంఖ్య 268గా ఉంది. ఈ కుటుంబాల్లో కొందరికి ముందుగానే కరోనా లక్షణాలు కనిపించినా.. వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇవ్వకపోవడంతో.. కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తిచెందిందని అధికారులు అంటున్నారు.
ఆ 3 జిల్లాల్లోనూ..
హైదరాబాద్ తరువాత అత్యధిక కేసులు నమోదైన జిల్లా సూర్యాపేట. ఆ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం వరకు 83 కేసులు రికార్డవ్వగా.. అవన్నీ కూడా ఓ 25 కుటుంబాల నుంచే వచ్చినవే. మర్కజ్ లింకుతో తొలుత ఒక్కరికి వైరస్ సోకగా.. ఆ తర్వాత అతడి నుంచి శరవేగంగా వైరస్ వ్యాప్తి చెందింది. జోగులాంబ-గద్వాల జిల్లాలో మొత్తం 49 కేసులు నమోదు కాగా అందులో 45 కేసులు 30 కుటుంబాల ద్వారా వచ్చాయి. శుక్రవారం కూడా అక్కడ మూడు కేసులు నమోదు అయ్యాయి.
వికారాబాద్‌లో నమోదైన కేసులన్నీ ఓ 14 ఫ్యామిలీల నుంచే వచ్చినట్లు గుర్తించారు. ఆ జిల్లాలో ఇప్పటి వరకు 38 కేసులు రాగా.. అవన్నీ ఆ కుటుంబాల వల్లే వచ్చాయని తేలింది. ఇలా రాష్ట్రంలో మొత్తం కేసుల్లో సగం కేసులు 113 కుటుంబాల వల్లే నమోదు అయ్యాయి. కాగా కొన్ని కుటుంబాల్లో 6- 8 మంది సగటున వస్తే.. కొన్నింట 18 కేసులు కూడా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. మూడు రోజులుగా రాష్ట్రంలో కేసుల తీవ్రత తగ్గుతూ వస్తోంది.