కరోనా గుప్పిట చిట్టాపూర్!
ABN , First Publish Date - 2020-08-20T08:35:21+05:30 IST
దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చిట్టాపూర్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ్రామంలో 92 శాంపిళ్లను సేకరించి ఉస్మానియా

- సోలిపేట స్వగ్రామంలో భారీగా కేసులు
- 92 మందిని పరీక్షిస్తే 40 మందికి వైరస్
- సర్పంచికి నెగెటివ్.. అనంతరం పాజిటివ్
- దుబ్బాక నియోజకవర్గమంతా వైరస్ వ్యాప్తి
- టెస్టులు చేస్తే బాధితులు పెరిగే అవకాశం
- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కొవిడ్
హైదరాబాద్, సిద్దిపేట, ఆంధ్రజ్యోతి/దుబ్బాక, ఆగస్టు 19: దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చిట్టాపూర్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గ్రామంలో 92 శాంపిళ్లను సేకరించి ఉస్మానియా ఆస్పత్రికి పంపగా 40 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. ఇంకొన్ని శాంపిళ్ల ఫలితం రావాల్సి ఉంది. కాగా, ఈ నెల 6న సోలిపేట అంత్యక్రియల తర్వాత వ్యక్తిగత సహాయకులు ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. మంగళవారం కుటుంబ సభ్యులు నలుగురికి వైరస్ సోకింది. ఈ పరిణామాల మధ్య ఆదివారం దశ దిన కర్మ సందర్భంగా.. గ్రామంలో 16 మంది కరోనా బారినపడినట్లు మంత్రి హరీశ్‌రావు దృష్టికి వచ్చింది. దీంతో ఆయన సంచార ఆర్టీపీసీఆర్ పరీక్షల వాహనాన్ని చిట్టాపూర్‌కు పంపారు. సోమవారం సేకరించిన శాంపిళ్లలో కొన్నింటి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. మరోవైపు రామలింగారెడ్డి బంధువు ఒకరికి తాజాగా పాజిటివ్‌గా తేలింది. చిట్టాపూర్ జనాభా 2,200 కాగా రామలింగారెడ్డి అంత్యక్రియలకు సుమారు 3 వేల మంది వచ్చారు.
దీంతో నియోజకవర్గమంతా వైరస్ పాకింది. ఇప్పటికే దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, చేగుంట, రాయపోల్, నార్సింగ్ మండలాల్లో 150 మందిపైగా వైర్‌సకు గురయ్యారు. చిట్టాపూర్ సర్పంచ్ పి.రాజయ్యకు మొదట నెగెటివ్ వచ్చింది. సంచార ఆర్టీపీసీఆర్ వాహనం ద్వారా జరిపిన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. అంతేకాక.. అంత్యక్రియలు, సంతాప సభ మధ్యలో గ్రామానికి వచ్చిన చాలామందిలో లక్షణాలు బయటపడతున్నాయి. దశ దినకర్మ హాజరైన పలువురు ఇతరచోట్ల పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా, రామలింగారెడ్డిని చివరిసారి చూసేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు. వారి కుటుంబాన్ని స్పీకర్ పోచారం, ఎంపీలు బీబీ పాటిల్ పరామర్శించారు. మంత్రి హరీశ్, మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి హాజరైన సంతాప సభలో సుమారు 1,500 మంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో పెరిగిన పరీక్షలు..
రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను వైద్య ఆరోగ్యశాఖ పెంచింది. ఇప్పటివరకు 20-22 వేల మధ్య పరీక్షలు చేస్తుండగా మంగళవారం 24,542 మందికి పరీక్షలు చేశారు. తాజాగా 1,763 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 95,700కు చేరింది. మరో 1,789 మంది కోలుకున్నారు. డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 73,991 అయింది. మరో 1,042 శాంపిళ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 484, మేడ్చల్‌లో 169, రంగారెడ్డిలో 166 నమోదయ్యాయి.
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కరోనా బారినపడ్డారు. కుటుంబ సభ్యులు, పీఏకూ పాజిటివ్ అని తేలింది.
- ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారంలో ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా సోకింది. సింగరేణిలో చేసిన పరీక్షల్లో 55 మందికి కరోనా నిర్ధారణ అయింది.
- తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐలు, వీఆర్వోలు సహా 12 మందికి కరోనా నిర్ధారణ కావడంతో సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
- మేడ్చల్ జిల్లా ఉద్దెమర్రిలో ఓ వృద్ధురాలు కరోనాతో చనిపోగా.. స్థానిక యంత్రాంగం స్పందించలేదు. దీంతో వేరేచోట నుంచి అంబులెన్స్, మనుషులను పిలిపించి అంత్యక్రియలు చేశారు.