గద్వాలలో విశ్వరూపం!

ABN , First Publish Date - 2020-04-24T09:16:18+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు బుధవారం కాస్త తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా 27 కొత్త కేసులు నమోదైతే, 58 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

గద్వాలలో  విశ్వరూపం!

ఒకేరోజు 10 మందికి పాజిటివ్‌.. 

ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా.. వారిలో ముగ్గురు పిల్లలే

హైదరాబాద్‌లో ఇద్దరు వృద్ధులకు.. నిలోఫర్‌ గార్డుకు కరోనా 

రియాసత్‌నగర్‌లో వృద్ధురాలి మృతి.. పెరుగుతున్న డిశ్చార్జీలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా కేసులు బుధవారం కాస్త తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా 27 కొత్త కేసులు నమోదైతే, 58 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13 కేసులు, గద్వాల జిల్లాలో పది, జనగామ, కొమరంభీమ్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 970కు చేరింది. డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 252కి చేరింది. రాజధానిలో 17వ తేదీ తర్వాత పాజిటివ్‌లు తగ్గుముఖం పట్టాయి. 17న నగరంలో గరిష్ఠంగా 46 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత సోమవారం 12 కేసులు, మంగళవారం 19 కేసులు, బుధవారం 10 కేసులు నమోదయ్యాయి. నగరంలో ఎక్కువ కేసులు మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారో వారి సంబంధీకులే ఉంటున్నారు. రియాసత్‌ నగర్‌లో బుధవారం రాత్రి 65 ఏళ్ల మహిళ మృతిచెందారు. మంగళ్‌హాట్‌లో 60 ఏళ్ల వృద్ధుడు మధుమేహం సమస్యతో ఆస్పత్రికి రాగా, ఎక్స్‌రే తీసినపుడు కరోనా అనుమానం వచ్చింది. పరీక్ష చేయగా పాజిటివ్‌ తేలింది. వెంటనే కుటుంబాన్ని, వైద్యం చేసిన డాక్టర్లను క్వారంటైన్‌కు పంపారు. గత శుక్రవారం గాల్‌బ్లాడర్‌ ఆపరేషన్‌ చేయించుకున్న మహిళ(62)కు తాజాగా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఆమెను గాంధీకి తరలించి, కార్పొరేట్‌ ఆస్పత్రి డాక్టర్లను, సిబ్బంది కలిపి మొత్తం 24 మందిని క్వారంటైన్‌కు పంపారు.


నిలోఫర్‌ ఆసుపత్రిలో ఇప్పటికే ఇద్దరు పిల్లలకు పాజిటివ్‌ రాగా, తాజాగా సెక్యూరిటీ గార్డుకు(45) కూడా వచ్చింది. గురువారం అతను ఇన్ఫోసిస్‌ కార్యాలయం వద్ద విధులు నిర్వర్తించాడు. పాజిటివ్‌ వచ్చిందని నివేదిక రాగానే ఇన్ఫోసిస్‌ నుంచే ఆయన్ను ఆరోగ్య సిబ్బంది గాంధీకి తీసుకెళ్లారు. ఎవరెవర్ని కలిసిందీ ఆరా తీస్తున్నారు. నిజాంపేట్‌లోని ఇందిరమ్మ కాలనీలో ఆర్నెల్ల వయస్సు చిన్నారికి అనారోగ్యంగా ఉండటంతో 8న తల్లిదండ్రులు నీలోఫర్‌కు తీసుకొచ్చారు. అప్పుడు పరీక్షలు చేసినపుడు నెగెటివ్‌ వచ్చింది. తాజాగా రెండోసారి పరీక్షలు చేయగా, పాజిటివ్‌ ఖరారైంది. మరోపక్క గాంధీ ఆస్పత్రిలో పేషంట్లు డిశ్చార్జి అవుతుండటంతో ఐసొలేషన్‌ వార్డులు ఖాళీ అవుతున్నాయి. గాంధీలో ప్రస్తుతం 693 మంది పాజిటివ్‌లు చికిత్స పొందుతున్నారు. చెస్ట్‌ ఆసుపత్రిలో ఉన్న 42 మందిలో 33 మంది డిశ్చార్జి అయ్యారు. సరోజనీ దేవి కంటి ఆస్పత్రిలో రెండో దఫాలో 209 మందిని అనుమానితులను చేర్పించారు. గురువారం నాటికి వారంతా డిశ్చార్జి అయిపోయారు. 


జనగామ జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఇప్పటికే ఇద్దరు పాజిటివ్‌లు కోలుకుని జీరో కేసులతో ప్రశాంతంగా ఉన్న జిల్లా తాజాగా ఆర్మీ జవాన్‌కు కరోనా నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పంజాబ్‌ నుంచి మార్చి 19న జిల్లాలోని సొంత గ్రామానికి ఆయన వచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న ఆయన్ను ఢిల్లీ నుంచి వచ్చిన రైలు ప్రయాణికుల జాబితాలో ఉండటంతో రోటీన్‌ తనిఖీలో భాగంగా ఇంటికి వచ్చి పరీక్ష చేశారు. నెల తర్వాత ఆయనకుపాజిటివ్‌ రావడం అందర్నీ ఆశ్చర్యపరచింది.  


 నిర్మల్‌ జిల్లాలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన యువకుడికి అప్పట్లోనే పరీక్ష చేయగా నెగటివ్‌ వచ్చింది. 14 రోజుల క్వారంటైన్‌కు పంపారు. రెండు రోజుల క్రితం ఇంటికి రాగా, విడుదలకు ముందు తీసిన శాంపిల్స్‌లో పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఆయన్ను తిరిగి ఆస్పత్రికి తరలించారు. ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ 55 ఏళ్ల వ్యక్తికి అలాగే జరిగింది. తనూ తబ్లిగీ సమావేశానికి వెళ్లి మార్చి 20న స్వగ్రామానికి చేరుకున్నాడు. క్వారంటైన్‌ చేశారు. రెండుసార్లు నెగెటివ్‌ రావడంతో ఇంటికి పంపారు. ఇంటికి వెళ్లేముందు తీసిన శాంపిల్స్‌ తిరిగి పరీక్షించగా పాజిటివ్‌ వచ్చింది. 


కరోనా పర్యవేక్షణకు గద్వాల జిల్లాకు ప్రత్యేక అధికారిగా వచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ గురువారం వివిధ స్థాయిల్లో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం 10 కొత్త కేసులు వచ్చాయని అధికారులు ప్రకటించారు. అందులో ఏడు గద్వాల పట్టణంలోనివే. ఆలంపూర్‌, ఐజ మండలాల్లో మరో మూడు నమోదయ్యాయి. జిల్లాలో కేసులు 46కు చేరాయి. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలలో పూర్తి అదుపులోకి వచ్చింది. కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నారాయణపేట జిల్లాలో ఒక చిన్నారికి పాజిటివ్‌ వచ్చి ఇటీవల మృతిచెందాడు. తర్వాత కొత్త కేసులేవీ రాలేదు.


గద్వాల జిల్లాలో పని చేస్తున్న ఓ టీవీ చానల్‌ రిపోర్టర్‌కు పాజిటివ్‌ తేలింది. తొలుత రిపోర్టర్‌ తమ్ముడికి, మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తాజాగా రిపోర్టర్‌కు కూడా వచ్చింది. అన్నదానం కార్యక్రమం అనంతరం టీవీ చానల్‌ రిపోర్టర్‌, మరో ఆరుగురు విలేకరులు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని కలిశారు. టీవీ చానల్‌ రిపోర్టర్‌ తమ్ముడు పాజిటివ్‌ అని తేలగానే ఎమ్మెల్యే హోంక్వారంటైన్‌ అయ్యారు. ఆరుగురు విలేకరులనూ క్వారంటైన్‌కు పంపారు. బుధవారం ఎమ్మెల్యేకు పరీక్షలు చేయగా నెగటివ్‌ వచ్చింది. శుక్రవారం గద్వాల టీవీ చానల్‌ రిపోర్టర్‌కు పాజిటివ్‌ రావడంతో ఆయనతో కలిసి తిరిగిన కొంతమంది విలేకరులను క్వారంటైన్‌కు పంపే అవకాశం ఉందని చెబుతున్నారు. 


గద్వాలలోని మొమిన్‌మొహల్లాలో ఒకే ఇంట్లో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. తల్లితో పాటు ఏడు, తొమ్మిది, పదేళ్ల పిల్లలకు పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో పిల్లలకు పాజిటివ్‌ రావడం ఇదే మొదటి సారి. 


సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన మొదటి వ్యక్తికి తాజా పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఏప్రిల్‌ 2 నుంచి గాంధీలో చికిత్స పొందుతున్న ఆయన్ను గురువారం డిశ్చార్జి చేశారు. తను కూడా ఢిల్లీ మర్కజ్‌ సమావేశాలకు వెళ్లి వచ్చారు. 

Updated Date - 2020-04-24T09:16:18+05:30 IST