మళ్లీ కరోనా..!!

ABN , First Publish Date - 2020-10-28T07:13:33+05:30 IST

రాష్ట్రంలో కరోనా రెండోసారి విరుచుకుపడే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. చలి కాలం ప్రారంభం కావడంతో ఫ్లూ వైరస్‌ పంజా విసురుతుందని అంచనా వేస్తోంది.

మళ్లీ కరోనా..!!

చలికాలం నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి

రెండో దశ ప్రమాదం.. 3 నెలలు కీలకం

ఏమరుపాటుతో ఐరోపా తరహాలో విజృంభణ

ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమీక్ష

హైదరాబాద్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా రెండోసారి విరుచుకుపడే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. చలి కాలం ప్రారంభం కావడంతో ఫ్లూ వైరస్‌ పంజా విసురుతుందని అంచనా వేస్తోంది. అలాంటి పరిస్థితులను నియంత్రించేందుకు ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులు వైద్య సిబ్బందికి సూచించారు. ప్రజలను చైతన్యపరచడంతో పాటు మహిళా సంఘాలను భాగస్వాములు చేసి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.


మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ.. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావుతో కలిసి జిల్లాల ఉన్నతాధికారులు, క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భవిష్యత్‌ కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. 


తీవ్రత తగ్గినా.. జాగ్రత్తలు మరువొద్దు

ప్రస్తుతం కరోనా తీవ్రత తక్కువగా ఉన్నా.. చలికాలంతో పాటు దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి పండుగలు ఉన్న నేపఽథ్యంలో రాబోయే 3 నెలలు కీలకమని, అంతా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ‘ప్రజల్లో కరోనా భయం పోవడం మంచిదే. కానీ ఏమీ కాదులే అన్న అతి ధీమా కొంపముంచుతుంది. అమెరికా, యూర్‌పలను రెండో దశ వణికిస్తోంది. అక్కడివారి నిర్లక్ష్యమే దీనికి కారణం. గుంపులుగా తిరిగితే రాష్ట్రంలోనూ కేసులు పెరిగే ప్రమాదం ఉంది.


పండుగల సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి’ అని పేర్కొన్నారు. అనుమానం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకునేలా బాధితుల్లో అవగాహన కల్పించాలన్నారు. కాగా, రాష్ట్రంలో డిసెంబరు చివరి నాటికి కరోనా రెండో దశ మొదలవుతుందన్న అంచనాల రీత్యా.. జాగ్రత్తలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు మార్గదర్శకాల జారీకి నిర్ణయించారు.


సెలవు రోజుల్లోనూ పరీక్షలు తగ్గొద్దు

ప్రస్తుతం సెలవు రోజులు, ఆదివారాల్లో కరోనా టెస్టులు చాలా తక్కువగా చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అసలే చేయడం లేదు. దీనిపై సమావేశంలో చర్చ జరిగింది. ‘వైర్‌సకు విరామం ఉండదు. కాబట్టి ఆదివారాలు, పండుగ రోజులు, ఇతర సెలవు రోజుల్లోనూ పరీక్షలు భారీగానే జరపాల’ని  నిర్ణయించారు.

ప్రతి ప్రాంతంలో శిబిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే కేంద్రాల సంఖ్యను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఐసీడీఎస్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఇతర కిందిస్థాయి సిబ్బంది చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించారు.


Updated Date - 2020-10-28T07:13:33+05:30 IST