కరోనా లేకున్నా ఒకరికి హోం క్వారంటైన్‌!

ABN , First Publish Date - 2020-12-31T04:33:54+05:30 IST

కరోనా లేకున్నా ఒకరికి హోం క్వారంటైన్‌!

కరోనా లేకున్నా ఒకరికి హోం క్వారంటైన్‌!

 ఐనవోలు, డిసెంబరు 30 : వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో కరోనా లేకపోయినా ఓ రైతును 12రోజులు హోంక్వారంటైన్‌లో ఉంచారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో ఈనెల 19న స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది 15 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇదే గ్రామానికి చెందిన రైతు పెండ్లి రవీందర్‌కు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యసిబ్బంది తెలిపారు. నిరక్షరాస్యుడైన అతడికి 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించి మందులు అందజేశారు. మందులు ఎలా వాడాలో వివరించి కుటుంబసభ్యులను దూరంగా ఉంచారు. కాగా తన తండ్రి హోంక్వారంటైన్‌ పూర్తవుతున్నందున అతడిని చూసేందుకు అత్తగారి ఇంటి నుంచి చిన్న కూతురు ఈనెల 29న ఒంటిమామిడిపల్లికి వచ్చింది. తండ్రి ఫోన్‌కు ఈనెల 21న వచ్చిన మెసేజ్‌ను పరిశీలించగా అందులో ‘కొవిడ్‌ నెగెటివ్‌’ అని ఉండడంతో ఇదేంటని స్థానిక ఏఎన్‌ఎంను ప్రశ్నించారు. దీనిపై ‘మీ తండ్రికి పాజిటివ్‌ వచ్చింది నిజమేకానీ, సాంకేతిక సమస్యతో మెసేజ్‌లోఅలా రావొచ్చు’ అని సర్ది చెప్పే యత్నం చేసింది. దీనిపై గురువారం పీహెచ్‌సీకి వెళ్లి డాక్టర్‌ను అడిగి తెలుసుకుంటానని రవీందర్‌ పేర్కొన్నాడు. ఈ విషయంపై మండల వైద్యాధికారి సుష్మను వివరణ కోరడానికి యత్నించగా ఆమె అందుబాటులో రాలేదు. 

 

Updated Date - 2020-12-31T04:33:54+05:30 IST