మరో 1,410 కేసులు
ABN , First Publish Date - 2020-07-10T08:41:28+05:30 IST
మరో 1,410 కేసులు

రాష్ట్రంలో 30 వేలు దాటిన బాధితులు.. కరోనాతో ఏడుగురు మృతి.. జీహెచ్‌ఎంసీలోనే 918కి మందికి వైరస్
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మహమ్మారి కరోనా తీవ్రత తగ్గడం లేదు. గురువారం మరో 1,410 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 30 వేలు దాటింది. దేశంలో 30 వేలపైగా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కాగా, కొత్త కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌వే 918 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్ జిల్లాలో 67, సంగారెడ్డిలో 79, వరంగల్ అర్బన్‌లో 34, కరీంనగర్ లో 32, భద్రాద్రి కొత్తగూడెంలో 23, నల్లగొండలో 21, నిజామాబాద్‌లో 18, మెదక్ లో 17, ఖమ్మంలో 12, సూర్యాపేటలో 10 కేసులు వచ్చాయి. వివిధ ప్రాంతాల్లో ఏడుగురు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 331కి చేరిందని ప్రజారోగ్య శాఖ డైరక్టర్ తెలిపారు. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,081 ఐసోలేషన్ పడకలు అందుబాటులో ఉండగా, 1,552 మంది రోగులు చికిత్స పొందుతున్నారని.. 15,529 పడకలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తాజా కేసుల్లో 15 మంది కరీంనగర్‌కు చెందినవారే. ఇప్పటికే కొందరు వ్యాపారులకు వైరస్ సోకడంతో.. శుక్ర, శని, ఆదివారాల్లో కిరాణం, మందుల దుకాణాలు మినహా మిగిలినవాటిని మూసి ఉంచాలని నిర్ణయించారు.
సాధారణ దగ్గేనని ఉదాసీనత.. టీచర్ మృతి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు (34) కరోనా లక్షణాలతో చనిపోయారు. పది రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నా.. సీజనల్ వ్యాధులుగా భావించారు. బుధవారం రాత్రి తీవ్ర జ్వరంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగడంతో కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు కరోనా లక్షణాలు గుర్తించి నల్లగొండ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. మార్గమధ్యంలో మృతిచెందారు. కరోనా భయంతో దహన సంస్కారాలు జరిపించేందుకు దగ్గరివారూ భయపడ్డారు. వైద్యాధికారులు కలుగజేసుకుని.. మృతదేహాన్ని శ్మశానవాటిక వద్దకు చేర్చి అంత్యక్రియలు పూర్తి చేయించారు.
‘హోం ఐసోలేషన్’పై నిరసన
కరోనా బాధితురాలిని తమ ఇళ్ల మధ్య ఉంచొద్దని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇటీవల గ్రామస్థురాలు ఒకరు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లగా కరోనా సోకింది. మరోసారి పరీక్షలు చేయించగా నెగిటివ్ వచ్చింది. గ్రామానికి వచ్చాక స్థానిక వైద్యారోగ్య శాఖ అధికారులు పరీక్షలు చేయగా కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను హోం ఐసోలేషన్‌లో ఉంచారు. చుట్టుపక్కల ఇళ్ల వారు మాత్ర ఆమెను ప్రభుత్వ ఐసోలేషన్‌కు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లకు రావాలంటే భయమేస్తోందని.. పొలాల్లో తాత్కాలిక షెడ్లు వేసుకుని ఉంటున్నామని వాపోయారు. సర్పంచ్ ఎదుట నిరసన తెలిపారు.
కలివేరు బెటాలియన్‌లో కలకలం
భద్రాద్రి జిల్లా చర్ల మండలం కలివేరు సీఆర్పీఎస్ 151వ బెటాలియన్‌లోని 23 మంది జవాన్లకు కరోనా నిర్ధారణ అయింది. పది రోజుల క్రితం బెటాలియన్ ఉద్యోగికి వైరస్ సోకింది. దీంతో 44 మందిని ఐసోలేషన్ చేశారు. లక్షణాలు కనిపించడంతో నమూనాలు సేకరించి పంపగా.. తాజాగా 23 మందికి పాజిటివ్ వచ్చింది.
2నెలల కిత్రం ఘర్షణలో కత్తి పోట్లు
కరీంనగర్, హైదరాబాద్‌లలో చికిత్స
చివరకు.. గాంధీలో కరోనాతో మృతి
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన యువకుడు (27) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మే 15వ తేదీన శ్రీరాంపూర్‌లో జరిగిన ఘర్షణలో ఈ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కరీంనగర్‌లో నెల రోజుల పాటు చికిత్స పొందాడు. తర్వాత 20 రోజులు హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం రక్త పరీక్ష నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది. బుధవారం యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున మరణించాడు. కాగా, యువకుడు నిమ్‌లో చికిత్స పొందుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే అతడికి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.