కరోనాతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-07-08T08:46:42+05:30 IST

కరోనాతో వ్యక్తి మృతి

కరోనాతో వ్యక్తి మృతి

5 లక్షలు కట్టాలని కార్పొరేట్‌ ఆస్పత్రి డిమాండ్‌

అప్పటికే రూ.6.30 లక్షలు కట్టించుకున్నారు

 మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదన్న బాధితులు


రాంగోపాల్‌పేట్‌,(ఆంధ్రజ్యోతి): కరోనాతో సికింద్రాబాద్‌లోని ఓ కార్పోరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు మరణించాడు. ఆ  యువకుడి చికిత్సకు రూ.12 లక్షలు కాగా రూ.5 లక్షల బిల్లు బకాయి చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో బాధితులు ఆందోళనకు దిగారు. యాదగిరి గుట్టకు చెందిన ఆటోడ్రైవర్‌ (28) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యులకు చూపగా హైదరాబాద్‌ తీసుకువెళ్లాని సూచించారు. గతనెల 23న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లి అడ్మిట్‌ చేశారు. ఆ సమయంలో రోగికి న్యుమోనియా ఉందని, తగ్గిపోతుందని, రోజుకు రూ.50-60 వేలు అవుతుందని వైద్యులు చెప్పారు. 25న కరొనీ పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది.  రోగి మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చనిపోయాడు. అప్పటికే అతని కుటుంబ సభ్యులు రూ.6.3  లక్షలు చెల్లించారు. మరో 5 లక్షల బిల్లు పెండింగ్‌లో ఉందని, ఆ బిల్లు కూడా చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఊర్లోని భూమి అమ్మి ఇప్పటి వరకు డబ్బు కట్టామని, ఇక తమ వద్ద చిల్లి గవ్వ కూడా లేదని కుటుంబ సభ్యులు వాపోయారు.  మృతదేహాన్ని కూడా చూడనివ్వలేదు. కాగా బాధితుల బంధువులకు రాష్ట్ర మంత్రి ఒకరు తెలుసు. వారి ద్వారా బాధితులు మంత్రికి ఫిర్యాదు చేశారు.  మంత్రి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరగా అంత్యక్రియల నిమిత్తం రూ.20 వేలు కట్టించుకున్నారు. ఎర్రగడ్డలోని హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా రోగికి అందించిన చికిత్సకు రూ.16 లక్షల బిల్లు అయిందని, రూ.3 లక్షల బీమాతో పాటు రూ.2 లక్షల నగదు చెల్లించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మూడు రోజుల క్రితం 3 లక్షల బకాయి బిల్లు కడతానని చెప్పిన రోగి బంధువు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదని, రోగి కూతురు వస్తే పీపీఈ కిట్‌ వేసి రోగిని చూయించామని చెప్పాయి. 

Updated Date - 2020-07-08T08:46:42+05:30 IST