జిల్లాలపైనా మహమ్మారి పంజా
ABN , First Publish Date - 2020-07-08T08:45:14+05:30 IST
జిల్లాలపైనా మహమ్మారి పంజా
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): నిన్నమొన్నటి దాకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతాపం చూపిన కరోనా.. తాజాగా జిల్లాలపైనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మినహా జిల్లాల్లో 457 కేసులు నమోదవడమే దీనికి నిదర్శనం. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ జిల్లాలో 94, కరీంనగర్‌లో 32, నల్లగొండలో 31, నిజామాబాద్‌లో 19, వరంగల్ అర్బన్‌లో 13, మెదక్‌లో 12, ములుగులో 12, మహబూబ్‌నగర్‌లో 11 కేసులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 1,422 కేసులు నమోదయ్యాయి. మంగళవారం 6,220 మందికి పరీక్షలు చేస్తే, 1,879 మందికి పాజిటివ్‌గా తేలింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 27,612కు చేరింది. 16,287 మంది కోలుకోగా, 11,012 మంది చికిత్స పొం దుతున్నారు. వైర్‌సతో మంగళవారం మరో ఏడుగు రు మృతి చెందారని.. మొత్తం మరణాల సంఖ్య 313కు పెరిగిందని బులెటిన్‌లో పేర్కొన్నారు.
గాంధీలో బెడ్లు ఖాళీ..
పాజిటివ్ ఉండి లక్షణాలు కాస్త ఎక్కువగా ఉంటే గాంధీ ఆస్పత్రికి రావాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. గాంధీలో 1,890 బెడ్లు ఉంటే, ప్రస్తుతం 740 మంది రోగులు మాత్రమే ఉన్నారని వెల్లడించింది. వీరిలో 130 మంది ఐసీయూలో, 356 మంది వెంటిలేటర్‌పై ఉన్నారని, ఇంకో 35 మంది సీపాప్ (శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్లకు పెట్టేది)పై ఉన్నారని తెలిపింది. మరో 219 మంది జనరల్ వార్డులో ఉండగా, 1150 బెడ్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేనివారు నేచర్‌క్యూర్, హోమియోపతి, ఆయుర్వేద హాస్పిటల్‌కు వెళ్లాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. వైరస్ లక్షణాలు సాధారణంగా ఉన్నవాళ్లు, పరీక్ష చేయించుకోవాలనుకునే వారు కింగ్ కోఠి, చెస్ట్, ఫీవర్ హాస్పిటళ్లకు వెళ్లాలని ఆరోగ్యశాఖ సూచించింది.
వికారాబాద్‌లో ఓ రిటైర్డ్ ప్రిన్సిపాల్ (68), జీహెచ్‌ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ కరోనాతో చనిపోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంగళవారం ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామ సర్పంచ్ ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ కరోనాతో ముగ్గురు చనిపోయారు.
కాజీపేటలో పరీక్షలను అడ్డుకున్న స్థానికులు
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట సమీపంలోని బోడగుట్ట ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్‌లో కరోనా టెస్టులను మంగళవారం స్థానికులు అడ్డుకున్నారు. నాలుగు రోజులుగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలకు చెందినవారికి ఇక్కడ పరీక్షలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కరోనా అనుమానితులు వస్తుండటంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బోడగుట్టకు రాకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచె వేశారు. బుధవారం నుంచి పరీక్షలు నిలిపివేస్తామని వైద్యులు హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు.