అర్ధరాత్రి మద్యం తరలింపు

ABN , First Publish Date - 2020-04-15T09:44:35+05:30 IST

లాక్‌డౌన్‌ ఉన్నా.. రాత్రి వేళల్లో అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన ఘటన మంగళవారం నర్సంపేటలో చోటు

అర్ధరాత్రి మద్యం తరలింపు

పట్టుబడిన యజమాని, హోంగార్డు, మరో ఇద్దరు

భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు

నర్సంపేట ఘటన


నర్సంపేట టౌన్‌, ఏప్రిల్‌ 14 : లాక్‌డౌన్‌ ఉన్నా.. రాత్రి వేళల్లో అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన ఘటన మంగళవారం నర్సంపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. వరంగల్‌కు చెందిన సింగరి  రాజ్‌కుమార్‌, గాజర్ల రవి నర్సంపేట పట్టణంలోని నెక్కొండరోడ్‌లో శ్రీనివాస వైన్‌ షాపు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు షాపులో పనిచేసే కక్కెర భిక్షపతి, వీరి స్నేహితుడు కాజీపేటకు చెందిన హోంగార్డు ఆకుల రాజేష్‌లు నర్సంపేట నుంచి వరంగల్‌కు మద్యం తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.


ఇందుకు రాజేష్‌కు చెందిన కారుకు పోలీస్‌ స్టిక్కర్‌ వేసుకొని సోమవారం అర్ధరాత్రి వరంగల్‌ నుంచి నర్సంపేటకు వివిధ చెక్‌పోస్టుల వద్ద పోలీసులమని చెప్పుకుంటూ నర్సంపేటలోని వైన్‌షాపు వద్దకు చేరుకున్నారు. షాపునకు ఎక్సైజ్‌ పోలీసులు వేసిన సీల్‌ను తొలగించి షాపులో నుంచి 12 ఐబీ ఫుల్‌బాటిళ్లు, 48 ఐబీ, 48 ఓసీ క్వార్టర్‌ బాటిళ్లను కారులో వేసుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పెట్రోలింగ్‌ చేస్తున్న ఎస్సైలు నవీన్‌కుమార్‌, యుగంధర్‌ వారిని పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. మద్యం బాటిళ్లతోపాటు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై వివరించారు. 


ఎక్సైజ్‌ అధికారుల ప్రోత్సాహంతోనే పెట్రేగిపోతున్నారని, నామమాత్రంగా సీల్‌ వేయడంతో నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా మద్యంను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2020-04-15T09:44:35+05:30 IST