ఆదివాసీల మధ్య వివాదం

ABN , First Publish Date - 2020-02-12T09:57:58+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం కుమ్మరి తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాముగూడ కొలాం గ్రామంలో గిరిజన వంశాల మధ్య ఏర్పడిన వివాదం చినికి చినికి

ఆదివాసీల మధ్య వివాదం

చిచ్చు పెట్టిన ‘తూర్పు.. పడమర’ పూజలు.. కొలాం-కొడప తెగల నడుమ పంచాయితీ

గ్రామాన్ని ఖాళీ చేస్తున్న కొడప వంశీయులు 

ఉట్నూర్‌, ఫిబ్రవరి 11: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం కుమ్మరి తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాముగూడ కొలాం గ్రామంలో గిరిజన వంశాల మధ్య ఏర్పడిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఆత్రం వంశానికి చెందిన కొలాం గిరిజనులు, కొడప వంశానికి చెందిన కొలాంల మధ్య వివాదం ఏర్పడింది. యేటా కొడప వంశస్థులు భీమ దేవరకు గ్రామం తూర్పున ఉన్న మందిరంలో పూజలు చేయడం ఆనవాయితీ. ఈ విషయం ఆత్రం కొలాం గిరిజనులకు నచ్చక.. తూర్పు వైపు పూజలు చేయడం సరికాదని.. తాము చేస్తున్నట్లుగా భీమ దేవర పూజలను పడమరవైపు చేయాలని కొడప వంశానికి చెందిన పెద్దకు సూచించారు. దీంతో మాట మాట పెరిగి.. రెండు వంశాల మధ్య వివాదం పెద్దదయింది.


ఈ నెల 2, 9వ తేదీల్లో రెండుసార్లు జిల్లాలోని ఆదివాసీ కొలాం పెద్దలు పంచాయితీ నిర్వహించి ఇరువర్గాలకు నచ్చజెప్పారు. అయినా వివాదం సద్దుమణగలేదు. తమ మాట విననందుకు గ్రామంలో ఉండాలంటే.. రూ.21 వేలు చెల్లించాలంటూ ఆత్రం వంశీయులు చెప్పడంతో.. ఆ మొత్తాన్ని కొడప వంశస్థులు చెల్లించారు. అయితే తర్వాత కొడవ వంశపు పెద్ద మనసు మార్చుకొని తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఆత్రం వంశస్థులను కోరాడు. తమ వంశంపై వచ్చిన అభియోగం మనస్తాపానికి గురి చేస్తున్నందు వల్ల తాను గ్రామం నుంచి వెళ్లి పోతానంటూ ప్రకటించడంతో.. ఆయన వెంట మరో 19 కుటుంబాలు మంగళవారం గ్రామాన్ని వీడాయి. ఈ సందర్భంగా వారు ఎందా సమీపంలోని వంజరి గూడలో తాత్కాలిక డేరాలు ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆత్రం భుజంగ్‌రావు గ్రామానికి చేరుకొని వివాదాల గురించి ఆరా తీశారు. గిరిజనులను చైతన్యపరచడానికి ఐటీడీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.

Updated Date - 2020-02-12T09:57:58+05:30 IST