కాంగ్రెస్ చలో దుబ్బాక!
ABN , First Publish Date - 2020-10-08T09:26:22+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అధిష్ఠానమే స్వయంగా ఈ ఎన్నికపై దృష్టి పెట్టింది. అభ్యర్థి ఎంపిక దగ్గరినుంచి నేతలను సమాయత్తం చేసే

రాష్ట్ర నాయకత్వమంతా మోహరింపు..
ఉత్తమ్ సహా ముఖ్యనేతలకు మండలాల వారీ బాధ్యతలు
ఇతర నేతలకు ఒక్కో గ్రామం కేటాయింపు
అగ్ర నాయకత్వానికి క్షేత్ర స్థాయి బాధ్యతలు ఇదే తొలిసారి
ఇప్పటికే దుబ్బాకలో భట్టి, ఉత్తమ్ భేటీలు
ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టిన హైకమాండ్
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దుబ్బాక ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అధిష్ఠానమే స్వయంగా ఈ ఎన్నికపై దృష్టి పెట్టింది. అభ్యర్థి ఎంపిక దగ్గరినుంచి నేతలను సమాయత్తం చేసే వరకూ క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. ఏకంగా రాష్ట్ర స్థాయి నేతలను నియోజకవర్గ పరిధిలోని మండలాలకు, గ్రామాలకు ఇన్‌చార్జులుగా నియమించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఇతర ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలకు మండలాలు, గ్రామాల వారీగా సమన్వయ బాధ్యతలు అప్పగించింది. ఉప ఎన్నిక పూర్తయ్యేవరకూ నియోజకవర్గంలోనే ఉండి కేటాయించిన మండలాలు, గ్రామాల్లో పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇలా అగ్ర నాయకత్వానికి క్షేత్ర స్థాయి బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి.
అనేక కారణాలు...
త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండగా, మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఒక సీటు ఎక్కువగా గెలుచుకున్న బీజేపీ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికను ఆ పార్టీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో సత్తా చూపకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఉప ఎన్నికలో శక్తినంతా ప్రయోగించేందుకు సిద్ధమైంది.
ఠాగూర్‌కు తొలి సవాలు..
ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌కు దుబ్బాక ఉప ఎన్నిక తొలి సవాలు. దీంతో ఆయన తొలి రోజు నుంచే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. హైదరాబాద్‌కు వచ్చీ రావడంతోనే దుబ్బాక ఉప ఎన్నిక సన్నాహాలపైనే సమీక్ష నిర్వహించారు. మలి పర్యటనలో జరిగిన సమావేశంలో చావో, రేవో అన్నట్లుగా దుబ్బాకలో పనిచేయాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. ఓ నేత ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడబోగా.. ఆయనను వారించారు. ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చూసుకుంటారని, దుబ్బాక ఉప ఎన్నిక ముగిసేదాకా నేతలంతా దానిపైనే దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లోనూ 2014 ఎన్నికల్లో చెరుకు ముత్యంరెడ్డికి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు సాధించాలని లక్ష్యం విధించారు.
146 గ్రామాలకు.. ఒక్కో నేతకు ఒక్కో గ్రామం చొప్పన బాధ్యతలు అప్పగించాలని, మండలాలకు ఇన్‌చార్జులుగా నియమితులైన నేతలు వారిని సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆయా చోట్ల పార్టీ సాధించిన ఓట్ల ఆధారంగా అక్కడ బాధ్యతలు నిర్వహించిన నేతలను పదవుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకుంటామని అధిష్ఠానం సంకేతం ఇచ్చింది. పోటీ రీత్యా మెజారిటీ ఓట్లు సాధించి తీరాల్సిన బాధ్యత ఆయా నేతలపై పడింది. దీంతో ఉత్తమ్, భట్టి సహా పలువురు ముఖ్యనేతలు బుధవారమే కేటాయించిన మండలాలకు వెళ్లిపోయి సమావేశాలు నిర్వహించారు. మిగిలిన నేతలు కూడా నియోజకవర్గంలో మోహరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా దుబ్బాక ఎన్నికల క్షేత్రంలోకి దిగనుంది.
అభ్యర్థి నిర్ణయంలోనూ అధిష్ఠానం మార్కు!
దుబ్బాకకు అభ్యర్థిని ప్రకటించడంలోనూ కాంగ్రెస్ అధిష్ఠానం తనదైన మార్కు ప్రదర్శించింది. వాస్తవానికి చెరుకు శ్రీనివా్‌సరెడ్డిని రంగంలోకి దించేందుకు పార్టీ నేతలు ముందునుంచీ ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించక పోవడంతో సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును అధిష్ఠానానికి ప్రతిపాదించారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారవుతుందన్న దశలో శ్రీనివా్‌సరెడ్డితో మణిక్కం ఠాగూర్ చర్చలు జరిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌ను శ్రీనివా్‌సరెడ్డి నివాసానికి పంపి.. ఫోన్లో మాట్లాడించారు.
దీనిని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సమన్వయం చేశారు. శ్రీనివా్‌సరెడ్డి నామినేషన్ కార్యక్రమంలోనూ ఉత్తమ్, దామోదరతోపాటు అభ్యర్థిత్వం రేసులో చివరి వరకూ ఉన్న నర్సారెడ్డి, వెంకటనర్సింహారెడ్డి, శ్రవణ్‌కుమార్ పాల్గొనేలా చూస్తున్నారు. గతంలోనూ ఉప ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఈ స్థాయిలో మోహరించిన సందర్భం ఎప్పుడూ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.