సభ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-03-08T09:45:53+05:30 IST
మార్క్‌ఫెడ్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు శనివారం అసెంబ్లీలో తీవ్ర ఉద్రికత్తలకు దారితీశాయి. ఆ ఘటనపై తమకు మాట్లాడేందుకు

మార్క్‌ఫెడ్ ఘటనపై మాట్లాడనివ్వాలని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్
అనుమతించని స్పీకర్.. సభ్యుల సస్పెన్షన్‌పై వేముల తీర్మానం
‘రాజగోపాల్ రెడ్డి గెటౌట్’ అంటూ సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
మునుగోడు ఎమ్మెల్యేను చేతులపై ఎత్తుకెళ్లిన మార్షల్స్
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మార్క్‌ఫెడ్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు శనివారం అసెంబ్లీలో తీవ్ర ఉద్రికత్తలకు దారితీశాయి. ఆ ఘటనపై తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ పోచారం శ్రీనివా్‌సరెడ్డి నిరాకరించినా.. వారు పదే పదే నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడబోతుండగా.. వారు అడ్డు తగలడంతో ఒకింత అసహనానికి గురైన సీఎం కేసీఆర్.. ‘‘ఆయామ్ నాట్ ఈల్డింగ్. బయట చాలా జరుగుతుంటాయి. మీరు నలుగురు లేరు.. మేం 100 మందిమి ఉన్నాం. అరుపులు మేమూ పెట్టగలం. సభలో ఎవరు అరాచకం చేస్తున్నారో అర్థం అవుతోంది.
నిన్ను సభలో ఉండాలని ఎవరడుగుతున్నారు? గెటవుట్’’ అని రాజగోపాల్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ సభ్యుల బహిష్కరణ కోసం మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ వెంటనే ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇంతలో రాజగోపాల్‌రెడ్డి పోడియం వద్దకు దూసుకెళ్లి స్పీకర్‌తో వాదనకు దిగారు. మార్షల్స్ వచ్చి రాజగోపాల్‌రెడ్డిని చేతులపై ఎత్తుకుని సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.