బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత!

ABN , First Publish Date - 2020-12-11T20:31:25+05:30 IST

తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదను పెడుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను బీజేపీ టార్గెట్ చేస్తూ పావులు కదుపుతోంది.

బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత!

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదను పెడుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను బీజేపీ టార్గెట్ చేస్తూ పావులు కదుపుతోంది. బీజేపీ వ్యూహం చూస్తుంటే కాంగ్రెస్ మూలాలు లేకుండా చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అర్థమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి డా.ఎ.చంద్రశేఖర్  బీజేపీలోకి చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి డీకే అరుణ ఆహ్వానించారు. చంద్రశేఖర్‌తో అరుణ సంప్రదింపులు దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. ఆయన అతి త్వరలో బీజేపీలో చేర‌ుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రశేఖర్‌ బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దల స‌మ‌క్షంలో వికారాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ పెట్టి పార్టీలో చేరుతారని చంద్రశేఖర్‌ సన్నిహితులు చెబుతున్నారు. 


వాస్తవానికి గతంలో సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలు కలిగిన చంద్రశేఖర్‌ ఒక సమయంలో టీఆర్‌ఎస్‌లో ఒక వెలుగు వెలిగారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడుని చేస్తామని వికారాబాద్‌లో కేసీఆర్‌ ప్రకటించడంతో చంద్రశేఖరే సీఎం అవుతారని భావించారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో చంద్రశేఖర్ మంత్రిగా పనిచేశారు. అయితే తరువాత కాలంలో పార్టీలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2019లో ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇపుడు ఆయన్ని బీజేపీలోకి తీసుకువచ్చేందుకు కమలనాథులు చర్చలు జరిపారు. అలాగే కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. 


గ్రేటర్‌ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించిన భారతీయ జనతాపార్టీ వైపు ఇతర పార్టీలకు చెందిన అనేకమంది నేతలు ఆకర్షితులవుతున్నారు. వచ్చే పార్ల మెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవు తున్న బీజేపీ.. ఆయా పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యంగా కొందరు కాంగ్రెస్‌ నేతలతోపాటు అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన నేతలతో కూడా చర్చలు మొదలు పెట్టింది.

Updated Date - 2020-12-11T20:31:25+05:30 IST