కరోనా నియంత్రణలో చేతులెత్తేసిన సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2020-07-19T08:31:55+05:30 IST
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలో సీఎం కేసీఆర్ చేతులెత్తేశారని వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా...

- కొవిడ్-19 చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
- మృతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
వరంగల్ సిటీ, జూలై 18: రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలో సీఎం కేసీఆర్ చేతులెత్తేశారని వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘స్పీకప్ తెలంగాణ’ ఆన్‌లైన్ ప్రచార కార్యక్రమం శనివారం హన్మకొండలోని డీసీసీ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో ఆదుకోవాల్సిన సీఎం ఫామ్‌హౌస్‌కు వెళ్లారని విమర్శించారు. కొవిడ్-19 చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో డోపిడీని నియంత్రించాలని, రాష్ట్రంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని, వైద్య పరికరాలు, సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలని, మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కరోనాతో మృతి చెందిన ప్రజలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రాజేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు మీసాల ప్రకాశ్, కొత్తపల్లి శ్రీనివాస్, పులి అనిల్‌కుమార్, దుబ్బా శ్రీనివాస్‌లతో పాటు మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహత్‌పర్వీన్, జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, గొట్టిముక్కల రమాకాంత్‌రెడ్డి, తోట వెంకన్న, నాగరాజు, బంక సంపత్, బంక సరళ, నాయిని లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇకనైనా మేల్కొనాలి...
రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కొని కరోనా వైరస్ నియంత్రణ చర్యలను చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల ప్రకాశ్ హితబోధ చేశారు. కాంగ్రెస్ చేపట్టిన ‘స్పీకప్ తెలంగాణ’ ఆన్‌లైన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వరంగల్ తూర్పులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కూచన రవీందర్, సందెల లాజర్, జంగం ప్రభాకర్, గూడ గోవర్ధన్, గూడ శారద, నరేష్ తదితరులు పాల్గొన్నారు.