రైతు బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆందోళన

ABN , First Publish Date - 2020-09-26T10:18:32+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం హన్మకొండలోని అశోకా జంక్షన్‌లో

రైతు బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ఆందోళన

మోదీ సర్కారు రైతు వ్యతిరేకి

వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి

అశోకా జంక్షన్‌లో ధర్నా, రాస్తారోకో..

పోలీసులు, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం, అరెస్టు


వరంగల్‌ సిటీ, సెప్టెంబరు 25: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం హన్మకొండలోని అశోకా జంక్షన్‌లో ధర్నా చేపట్టారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తొలుత డీసీసీ భవన్‌ వద్ద నిరసన తెలిపారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు.. అశోకా జంక్షన్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకోగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. నాయిని రాజేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొంటుండగా పోలీసుల వాహనాన్ని నాయకులు అడ్డుకున్నారు. రాజేందర్‌రెడ్డితో పాటు మరికొందరిని హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 


రైతు వ్యతిరేక ప్రభుత్వం:నాయిని

కేంద్రంలోని మోదీ సర్కారు రైతు వ్యతిరేకని కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు కార్పొరేట్‌ సంస్థల కోసమేనని విమర్శించారు. బీజేపీ నేతలే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల భూములను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర లభించే అవకాశాలు తగ్గిపోతాయని తెలిపారు. రైతులు తమ పంటను ఎక్కడ విక్రయించినా లాభాలు వస్తాయనే కేంద్ర ప్రభుత్వ మాటల్లో నిజం లేదని రాజేందర్‌రెడ్డి దుయ్యబట్టారు.


వ్యాపారులు మార్కెట్లను నియంత్రించడం.. దళారులు రైతులను మరింత దోచుకోవడం వంటి అనార్థాలకు రైతు బిల్లు కారణమవుతుందని తెలిపారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కయ్యే ప్రమాదం ఉందన్నారు. నూతన బిల్లు రైతులకు మరింత ముప్పుగా మారిందన్నారు. తక్షణమే బిల్లులను ఉపసంహరించుకోవాలని రాజేందర్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో ఇనగాల వెంకట్రాంరెడ్డి, సిరిసిల్ల రాజయ్య, బత్తిని శ్రీనివాస్‌, కొత్తపల్లి శ్రీనివాస్‌, మీసాల ప్రకాశ్‌, డాక్టర్‌ పులి అనిల్‌కుమార్‌, దుబ్బాక శ్రీనివాస్‌, బిన్నీ లక్ష్మణ్‌, కూచన రవళి, శ్రీధర్‌గౌడ్‌, మహ్మద్‌ అయూబ్‌, కృష్ణగౌడ్‌, తోట వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-26T10:18:32+05:30 IST