నేడు కోవిడ్ 19పై కాంగ్రెస్ డిజిటల్ ఉద్యమం
ABN , First Publish Date - 2020-07-18T14:56:16+05:30 IST
నేడు కోవిడ్ 19పై కాంగ్రెస్ డిజిటల్ ఉద్యమం

హైదరాబాద్: స్పీక్ అప్ తెలంగాణ పేరుతో కోవిడ్19 పై కాంగ్రెస్ నేడు డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పలు డిమాండ్లను కాంగ్రెస్ ముందుకు తీసుకువచ్చింది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని... పేదలకు ఉచిత వైద్యం అందించాలని తెలిపింది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫీజులను నియంత్రించాలని.. యాభై శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది. హైదరాబాద్, అన్ని జిల్లా కేంద్రాల్లోని హోటల్స్‌లో 50 రూమ్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని... హోమ్ క్వారంటైన్‌లకు ఆ రూమ్‌లను ఉపయోగించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని తెలిపింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని...అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు పెంచాలన్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది. అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ డిమాండ్లను కాంగ్రెస్ గట్టిగా వినిపించనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే డిజిటల్ ఉద్యమంలో ప్రతీ కార్యకర్త పాల్గొనాలని టీపీసీసీ పిలుపునిచ్చింది.