కరోనా కంటే దరిద్రం కాంగ్రెస్
ABN , First Publish Date - 2020-07-08T08:31:46+05:30 IST
కరోనా కంటే దరిద్రం కాంగ్రెస్

ఈర్ష్యాద్వేషాలతో విమర్శలు
కరోనా కట్టడిలో దేశానికే దారి చూపాం
తీరు మార్చుకోకపోతే కాంగ్రెస్ కు కుక్కచావు: జగదీశ్ రెడ్డి
ఆరునూరైనా కడతాం..అడ్డమొస్తే లోపలేస్తాం: తలసాని
హైదరాబాద్, జూలై 7(ఆంధ్రజ్యోతి): గత పాలకులు శిథిలాలను అప్పగించారని, వాటి కింద పాలన వద్దన్నదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంకల్పం అని.. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ఔన్నత్యాన్ని దేశం, ప్రపంచానికి తెలియజేసేందుకే కొత్త సచివాలయ నిర్మాణం జరుగుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం కడతామని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామని, ఆ మేనిఫెస్టోను అమలు చేస్తుంటే కాంగ్రెస్ నేతలకు ఎందుకు నొప్పి, ఏడుపు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రె్‌సలాంటి దరిద్రపు ప్రతిపక్షం దేశంలోనే లేదని, కరోనా కంటే దరిద్రమైనది ఆ పార్టీ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ శ్రీనివా్‌సరెడ్డి, ఎమ్మెల్యే గాదిరి కిశోర్‌తో కలిసి మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం మీద ఈర్ష్య, ద్వేషాలతోనే కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కట్టడిలో దేశానికే తెలంగాణ దారి చూపిందని, వలస కార్మికుల విషయంలో కేసీఆర్ చూపిన మానవీయతను అందరూ ప్రశంసించారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కావడం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ లాంటి నాయకులకు ఇష్టం లేదని, తెలంగాణ రావడం వల్ల కాంగ్రె్‌సకు అధికారం పోయిందనే భావన ఆ పార్టీ నేతల్లో ఉందన్నారు. హైదరాబాద్‌లో ఏపీ పునర్‌విభజన చట్టంలోని సెక్షన్ 8 విధించాలని కాంగ్రెస్ నేతలు చేసిన డిమాండ్ అజ్ఞానంతో కూడుకున్నదని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్‌లు ఉండగా.. సెక్షన్ 8 ప్రస్తావన అర్థరహితమన్నారు. మరో ఏడు జిల్లా కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు చేస్తున్నామని, చికిత్స కూడా అందించనున్నామన్నారు. ఉత్తమ్‌ను పార్టీ నేతలే వద్దనుకుంటున్నారని, ఆయనేమో టీఆర్‌ఎస్ మీద విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ద్వారా టీఆర్‌ఎస్ పాలనకు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే కాంగ్రె్‌సకు ప్రజల చేతిలో కుక్కచావు తప్పదని హెచ్చరించారు.
ఆ భవనాలు పడావు పడ్డాయి: తలసాని
ఆరునూరైనా, ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా సచివాలయం కట్టి తీరుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడితే మెడలుపట్టి లోపలేస్తామని హెచ్చరించారు. సచివాలయం అంటే ఓ పవిత్ర స్థలం అని, అక్కడ పడావు పడిన భవనాలు ఉన్నాయన్నారు. కొత్త సచివాలయం కట్టాలనే నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని, ధనిక రాష్ట్రమైన తెలంగాణకు బ్రహ్మాండమైన సచివాలయం ఉండాలని 2018 ఎన్నికలకు ముందే తాము చెప్పామని గుర్తుచేశారు. దారుస్సలాం ఆదేశాలను పాటిస్తుండటంతోనే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ఉటంకిస్తూ వారు చేస్తున్న వ్యాఖ్యలు బుద్ధి, జ్ఞానంతో చేసినట్లుగానే ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ గొప్పదనాన్ని చాటే విధంగా సచివాలయాన్ని నిర్మిస్తామని రైతుంబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.550 కోట్లతో సెక్రటేరియట్ నిర్మించుకునే స్థితిలో తెలంగాణ లేదనుకుంటే అది కాంగ్రెస్ నేతల భావదారిద్య్రమని విమర్శించారు.
ఆంధ్రా పెత్తనం కోరుకుంటున్నారా? ఉత్తమ్‌పై హరీశ్ ఆగ్రహం
తెలంగాణ ఆవిర్భవించిన ఆరేళ్ల తర్వాత కూడా హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్‌కు పెత్తనం ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అని టీపీపీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వమే స్వచ్ఛందంగా హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగించిందని గుర్తు చేశారు. అలా చేశాక సెక్షన్ 8 ప్రశ్నే ఉత్పన్నం కాదని హరీశ్‌రావు ట్విటర్‌లో స్పష్టంచేశారు. ఏపీ సీఎంల దగ్గర ఉత్తమ్ పనిచేస్తున్నారని, ఆయన ఇంకా అదే మనస్తత్వంతో కొనసాగుతున్నట్టగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.