కరోనా.. కలవరం.. లాక్‌డన్‌తో కలకలం
ABN , First Publish Date - 2020-03-24T08:22:16+05:30 IST
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా

తెల్లవారుజామునుంచే మార్కెట్ కిటకిట
14 రోజుల హౌజ్ ఐసోలేషన్‌కు 38 మంది
మహబూబాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. రానున్న రోజుల్లో ఎలా...? అన్న కలవరం అందరిలోనూ కన్పించింది. 24 గంట ల జనతా కర్ఫ్యూకు అనూహ్యంగా స్పందించిన జనం ఆపై లాక్‌డౌన్ ప్రకటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతోంది..? ఏం జరగబోతోంది..? ఎందుకిలా ప్రభుత్వం ప్రజలను కట్టడి చేస్తోంది.. లాంటి ప్రశ్నలతో జనం ఉక్కిరి..బిక్కిరయ్యారు. రవాణా వ్యవస్థకు బ్రేక్ వేస్తూనే జన జీవనానికి అంతరాయం కలుగకుండా నిబంధనలతో కూడిన ఆంక్షలను వి ధించడం దీనికనుగుణంగా ప్రజల నుంచి సానుకూల స్పందన తొలిరోజు కన్పించలేదు.
తెల్లవారుజాము నుంచే మార్కెట్‌లు కిటకిటలాడాయి. కిరాణాషాపుల వద్ద సరుకుల కోసం అన్ని వర్గాల ప్రజలు పరుగులు తీశారు. మొ దట్లో సరుకులు అమ్మాలా... వద్దా అని సందేహించిన వ్యాపారులు ఆపై వినియోగదారుల ఒత్తిడి తట్టుకోలేక దుకాణాల మెయిన్ షట్టర్లు మూసి ఉన్నప్పటికీ పక్క ఉన్న చిన్న ద్వారా ల ద్వారా సరుకులు ఇచ్చేశారు. చికెన్ సెంటర్లలో ఉన్న కోళ్లను తక్కువ ధరకే విక్రయించి చేతులు దులుపుకున్నారు. కోడిగుడ్లు కేసుకు రూ.100 లోపే అమ్మేశారు. మొత్తానికి అందరిలోనూ నిత్యావసర సరుకులు, కూరగాయలు సమకూర్చుకోవాలన్న ముందస్తు జాగ్రత్తలు కన్పించాయి.
తెలుగు సంవత్సరాది కోసం...
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తుంటే ఏడాదికోసారి పలకరించే తెలుగు సంవత్సరాది ఉగాది నాడు కుటుంబసమేతంగా ఒక్కచోట కలిసి ఉండాలన్న ఆలోచన అందరిని స్వస్థలాల దారిని పట్టించింది. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ కొందరు... పలు అవసరాల రీత్యా స్థిరపడిన మరికొందరు స్వస్థలాలకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పండక్కి ముం దు తల్లిగారి ఇండ్లకు మహబూబాబాద్ జిల్లాకు చేరిన పలువురు మనసు మార్చుకుని అత్తింటికి పయనమయ్యారు.
అదేరీతిన వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత జిల్లాకు బయలుదేరారు. మార్గమాద్యంలో చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు నిలిపివేసిన సందర్భాల్లో స్వస్థలాలకు సంబంధించిన ఆధార్, ఇతరత్రా ధృవీకరణ పత్రాలను చూపించి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఉగాది పచ్చడి ఏర్పాట్ల కోసం ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకున్నారు. ఉగాదికి ముందే ఉప్పలమ్మలు పెట్టుకునే పలు గృహస్తులు చివరికి ఆ రోజైనా ఆనవాయితీ కొనసాగించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి శుక్రవారం లేదా ఆదివారం సంప్రదాయంగా ఈ వేడుక కొనసాగించేవారు ఈ సారి కరోనా కలిసి రాకపోవడంతో ఏదో ఒకరోజు ఆనవాయితీ తప్పవద్దని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైన్స్‌ల బంద్‌తో కల్లుపై నజర్
కరోనా లాక్‌డౌన్ నుంచేమద్యం దుకాణాలు మూతపడడంతో మద్యపాన ప్రియుల గొంతు లు తడారిపోయాయి. అసలే ఇండ్లకు పరిమితమై ఉండాల్సిన పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక రాత్రి నుంచే ముందు మందు జాగ్రత్తల కోసం అన్ని దారులు వెతికారు. కొందరు బడాబాబులు మద్యం దుకాణాదారులతో ఉన్న సంబంధాలతో ఫోన్‌ల ద్వారా లావాదేవీలు నడిపి ఫోన్‌పే, గుగుల్‌పే లాంటి ఆన్‌లైన్ పేమెంట్‌లు చేసి గుట్టుచప్పుడు కాకుండా కాస్ట్లీ మద్యాన్ని కొనుగోలు చేసుకున్నారు. ఇక మరికొందరైతే మైండ్‌సెట్ మార్చుకుని వైన్స్‌ల్లో బ్రాందీ, విస్కీ, బీర్లు దొరకకుంటే ఏం కల్లుతో సరిపెట్టుకుందామని వాడికలకు సిద్ధమయ్యారు. ఉదయం నుంచే మరికొందరు కల్లు అమ్మే కేంద్రాల గ్రామాల వైపు ప్రయాణమయ్యారు. సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టిన కల్లుకు అనుకూల కామెంట్లకు అనుగుణంగా ప్రకృతి సహజ సిద్ధమైన ఈ పానియమే మేలంటూ బారులు తీరారు.
జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు..
రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచే జిల్లా సరిహద్దులు దాటే వాహనాల సంఖ్య పెరిగిపోయింది. తొలిరోజు అధికారులు ప్రజల నడవడిక గమనిస్తూనే మధ్యాహ్నం కల్లా జిల్లా సరిహద్దు ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తొర్రూరు, మరిపెడ, కురవి రోడ్, నర్సంపేట రోడ్‌లోని భూపతిపేట, ఇల్లందు రోడ్లులోని సత్యనారాయణపురం ప్రాంతాల్లో ఐదు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాలను తనిఖీ చేసి అత్యవసరమయితేనే రాకపోకలకు అనుమతులు ఇవ్వడం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో మునిసిపల్ కమిషనర్ బి.ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది, ట్రాఫిక్ ఎస్సై అంబటి రవీందర్ నేతృత్వంలో పోలీసులు ప్రధాన రోడ్లపై తిరుగుతూ లాక్‌డౌన్ ఆంశాలను అమలు చేయాలని వివిధ వ్యాపారవర్గాలను కోరారు.
నిబంధనలు అతిక్రమించిన వారికి క్లాస్ తీసుకున్నారు. ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ సోమవారం ఇష్టారీతిన తిప్పడంతో 30 ఆటోలను సీజ్ చేశారు. కలెక్టర్ వీపీ.గౌతమ్ స్వయంగా మరిపెడ, తొర్రూరు ప్రాంతాలను సందర్శించి లాక్‌డౌన్‌ను పరిశీలించారు. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి భద్రునాయక్, మునిసిపల్ కమిషనర్ బి.ఇంద్రసేనారెడ్డి లాక్‌డౌన్‌కు సహాకరించాలని అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించారు. అదేరీతిన ఇటలీ, దుబాయ్‌ల నుంచి మహబూబాబాద్‌కు, చిన్నగూడూరు మండలం మంగోరిగూడెం, డోర్నకల్ మండలం వెన్నారం, కేసముద్రం, తొర్రూరు మండలాలకు విదేశాల నుంచి వచ్చిన 9 మందితో పాటు నెల్లికుదురు మండలం, రామన్నగూడెం ప్రాంతం నుంచి కరీంనగర్‌కు వలసవెళ్లి వచ్చిన 30 మందికి అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి పద్నాలుగు రోజుల పాటు హౌస్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.