‘శ్రీశైలం’ భద్రతపై ఆందోళన
ABN , First Publish Date - 2020-11-26T08:41:55+05:30 IST
శ్రీశైలం డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా రివర్ బోర్డులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల జగడందరిమిలా నిర్వహణ నీరుగారుతోంది. 2009లో వరదలు,

తెలుగు రాష్ట్రాల జగడంతో నీరుగారుతున్న నిర్వహణ
భారీ వర్షాలతో డ్యామ్‌పై పెరుగుతున్న ఒత్తిడి
నాగర్‌కర్నూల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా రివర్ బోర్డులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల జగడందరిమిలా నిర్వహణ నీరుగారుతోంది. 2009లో వరదలు, గత నెలలో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యామ్‌కు తక్షణం మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ నిపుణుల కమిటీ ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు తెలిసింది. ఈ మరమ్మతుల కోసం వెయ్యి కోట్లు అవసరమవుతాయనే అంచనాలను రూపొందించడంతో పాటు ఈ మొత్తం ఖర్చును కేంద్రం భరించాలని నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం.
భారీ వరదలతో ముప్పు
భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యామ్‌లో నీటి ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. 2009లో భారీ వరదలతో కర్నూలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండి గేట్లపై నుంచి కూడా వరద నీరు పొంగి ప్రవహించింది. అప్పట్లో ప్రాజెక్టులోని రెండు గేట్ల కింది భాగంలో ఏర్పడిన గోతులను అధికారులు గుర్తించారు. తక్షణం మరమ్మతులు చేపట్టకుంటే డ్యాం ఉని కి ప్రశ్నార్థకం కాగలదని హెచ్చరించారు.
2009 తర్వాత చోటు చేసుకున్న వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతు లు, నిర్వహణపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చలేదు. భారీ వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుపై నీటి ఒత్తిడి ఉండకుండా ప్రత్యామ్నాయంగా మరొక స్పిల్‌వేను నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించడం గమనార్హం. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టు గేట్లను ఒకే నెలలో 9 సార్లు ఎత్తి భారీగా వరద నీటిని దిగువకు వదలడం వల్ల ప్లంజ్‌పూల్‌లో గోతు లు ఏర్పడ్డాయని సాగునీటి శాఖ నిపుణులు అంటున్నారు.
స్పష్టత రాకుంటే ఉనికి ప్రశ్నార్థకమే!
సాగునీటి ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకునే విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పేచీ పడుతున్న నేపథ్యంలో డ్యామ్ నిర్వహణ బాధ్యత ఎవరిదనే విషయంలో కచ్చితమైన నిర్ణయం త్వరగా తీసుకోకుంటే అనర్థాలు తప్పవని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలు సాగు, తాగు నీటి అవసరాలతో పాటు జల విద్యుదుత్పాదన చేపడుతున్నాయి. నిర్వహణాపరమైన లోపాల కారణంగా ఎడమగట్టు జల విద్యుదుత్పాదన కేంద్రంలో మంటలు చెలరేగడం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీట మునగడం లాంటి ఘటనల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకుంటే నష్టాలు చవిచూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.