మరణించాక..పరిహారం

ABN , First Publish Date - 2020-12-07T08:44:05+05:30 IST

ఓ రైతు ఆత్మహత్యతోగానీ అధికారులు కళ్లు తెరవలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకొని రైతుల్లో అనందాన్ని నింపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు పరివాహక ప్రాంతంలో ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ పర్యాటక శోభను తీసుకొచ్చింది

మరణించాక..పరిహారం

బాధిత కుటుంబానికి అందజేత.. అదీ అరకొరే


సిరిసిల్ల, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఓ రైతు ఆత్మహత్యతోగానీ అధికారులు కళ్లు తెరవలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకొని రైతుల్లో అనందాన్ని నింపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు పరివాహక ప్రాంతంలో ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌  పర్యాటక శోభను తీసుకొచ్చింది. అయితే, నిర్వాసితులకు మాత్రం దుఃఖాన్ని మిగిల్చింది.  సిరిసిల్ల పట్టణానికి ముంపు వాటిల్లకుండా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి గతేడాది రూ.36కోట్లతో మానేరు వాగును ఆనుకొని 5 మీటర్ల వెడల్పు కలిగిన కరకట్ట నిర్మాణం చేపట్టారు. సడిమెల కిషన్‌(45) అనే రైతు కరకట్ట నిర్మాణంలో 25గుంటల స్థలాన్ని కోల్పోయాడు.


అతని రెండెకరాల పొలం ముంపునకు గురైంది. లాక్‌డౌన్‌ కావడంతో ఏ పనీ దొరక్క ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. తీవ్ర మనస్తాపం చెంది.. తనకు మిగిలిన రెండెకరాల పొలం వద్ద శనివారం ఉరేసుకున్నాడు. కరకట్ట ఊటతో రెండెకరాల పొలం నష్టపోవడం, కరకట్ట కింద ముంపునకు గురైన 25గుంటలకు పరిహారం అందకపోవడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశాడు.


కిషన్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని రైతులు, బీజేపీ నాయకులు ఆదివారం ఆందోళన చేపట్టారు. దీంతో తక్షణసాయం కింద లక్ష రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అధికారులు అందజేశారు. మిగతా పరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ కరకట్ట నిర్మాణంలో 150 మంది రైతులు 70 ఎకరాల వరకు భూమిని కోల్పోయారు. పరిహారం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే వర్షాలు పడడంతో రైతులు ఆందోళన చెందారు. ఇసుక నిల్వలను తీయకుండా కరకట్ట నిర్మించడం వల్లే 300ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు నీట మునిగాయని సమాచారం.

Updated Date - 2020-12-07T08:44:05+05:30 IST