సలామ్‌ సంతోష్‌!

ABN , First Publish Date - 2020-06-19T09:24:41+05:30 IST

దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీరుడి పార్థివ దేహాన్ని చూసి గుండెలు కరిగి కళ్ల నుంచి కన్నీరై బొట్లుగా రాలాయి! శత్రుదేశం దుర్నీతిపై

సలామ్‌ సంతోష్‌!

  • వీర సైనికుడికి దేశం కన్నీటి వీడ్కోలు
  • కాసరబాద వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు


లద్దాఖ్‌లో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబుకు సూర్యాపేట కాసరబాద వ్యవసాయ క్షేత్రంలో గురువారం సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంతిమయాత్రలో 10 వేల మందికి పైగా పాల్గొన్నారు. సంతోష్‌ బాబు అమర్‌ రహే, భారత్‌ మాతాకీ జై.. చైనా డౌన్‌డౌన్‌ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

  

సూర్యాపేట, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ వీరుడి పార్థివ దేహాన్ని చూసి గుండెలు కరిగి కళ్ల నుంచి కన్నీరై బొట్లుగా రాలాయి! శత్రుదేశం దుర్నీతిపై ఆగ్రహంతో ఊపిర్లు సెగలు కక్కాయి. ‘చైనా డౌన్‌ డౌన్‌’ అంటూ నరాలు తెగేలా గొంతులు ప్రతిధ్వనించాయి.. ‘జై జవాన్‌’ అంటూ పిడికిళ్లు బిగుసుకున్నాయి. ‘ఓ వీరుడా.. నీ త్యాగం వృథా కాదు’ అంటూ అభినందనలతో పార్థివ దేహంపై దోసిళ్లు పూలజల్లు కురిపించాయి. అంతిమయాత్ర సాగిన దారిపొడవునా జన సంద్రమే. అందరి మదిలోనూ భావోద్వేగ సుడిగుండమే! లద్ధాఖ్‌ సరిహద్దులో చైనాతో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యాపేట వాసి, కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ బాబుకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. సూర్యాపేటకు దగ్గర్లోని కాసరబాద వ్యవసాయ క్షేత్రంలో గురువారం సైనిక, ప్రభుత్వ లాంఛనాల ప్రకారం సంతోష్‌ బాబు అంత్యక్రియలు జరిగాయి. తండ్రి ఉపేందర్‌ చితికి నిప్పంటించారు.


ఎనిమిదేళ్ల కుమార్తె అభిజ్ఞ వేలును పట్టుకొని, నాలుగేళ్ల కుమారుడు అనిరుధ్‌ తేజను చంకనెత్తుకొని, మూగగా రోదిస్తూ భార్య సంతోషి చితిచుట్టూ తిరుగుతుంటే... ఏం జరుగుతోందో అర్థం కాని వయసులో అనిరుధ్‌ చితికి నిప్పంటిస్తున్న తాత చేతిని పట్టుకొని తండ్రికి కడసారి వీడ్కోలు పలుకుతుంటే.. చూసి భావోద్వేగంతో జనం కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి, అధికార, విపక్ష నేతలు ఇతర ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 


కల్నల్‌ సంతో‌ష్‌బాబు పార్థివదేహాన్ని బుధవారం రాత్రి 11:40గంటలకు ప్రత్యేక వాహనంలో సూర్యాపేటలోని విద్యానగర్‌లో ఉన్న నివాసానికి తీసుకొచ్చారు.  గురువారం ఉదయం 9:30కు ప్రత్యేకంగా అలంకరించిన ఆర్మీ వాహనంలో మొదలైన అంతిమయాత్ర, సంతోష్‌ బాబు వ్యవసాయ క్షేత్రం కాసరబాదకు 11:15 గంటలకు చేరింది. బాక్సును తెరిచిన అధికారులు.. సంతోష్‌ బాబు తల్లిదండ్రులు, భార్య పిల్లలకు పార్థివదేహాన్ని చూపించారు. భార్య సంతోషి.. పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్‌ తేజ సంతో‌ష్‌బాబుకు సెల్యూట్‌ చేశారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన పాడెపై పార్థివదేహం ఉంచిన బాక్సును ఉంచి అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశం వరకు తీసుకొచ్చారు. పాడెను ఆర్మీ అధికారులతో పాటు మంత్రి జగదీశ్‌ రెడ్డి, సంతో‌ష్‌బాబు కుటుంబ సభ్యులు  మోశారు. అనంతరం సైనిక దళాలు కవాతు నిర్వహించగా 11:45కు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తిచేశారు. సంతోష్‌ బాబు భార్యకు సైనిక దళాలు వందనం సమర్పించి ఆయనకు సంబంధించిన సైనిక దుస్తులను అందజేశారు. 12:05 గంటలకు 14 మంది సైనిక బృందం మూడు రౌండ్లలో 42 బులెట్లను గాల్లోకి పేల్చిన తర్వాత చితికి తండ్రి ఉపేందర్‌ నిప్పంటించారు. అంతకుముందు అంత్యక్రియల్లో దాదాపు 10వేల మందికిపైగా జనం పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణం నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు.  పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుంచి సంతో‌ష్‌బాబు అంత్యక్రియలు నిర్వహించిన పట్టణ శివారులోని కాసరబాద వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు జాతీయ జెండాలు పట్టుకొని నిలబడ్డారు. దారి పొడవునా భవనాల పైనుంచి పార్థివదేహాన్ని తీసుకెళ్తున్న వాహనంపై ప్రజలు పూలవర్షం కురిపించారు. సంతో్‌షబాబు అమర్‌ రహే, చైనా డౌన్‌డౌన్‌, భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.  


అన్నీ తానై వ్యవహరించిన జగదీశ్‌ రెడ్డి

కల్నల్‌ సంతో‌ష్‌బాబు అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. సంతో‌ష్‌బాబు మృతి చెందిన విషయం తెలియగానే హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు చేరుకుని ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు. సూర్యాపేటలో అంతిమ సంస్కారానికి సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌కు మృతదేహం చేరుకున్నాక అక్కడ నివాళులర్పించి ప్రత్యేక వాహనంతో వెంట ఉండి సూర్యాపేటకు తీసుకవచ్చారు. గురువారం ఉదయం నుంచి కార్యక్రమాలు ముగిసే వరకూ అన్నీ తానై వ్యవహరించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగేంధర్‌రావు, ఎమ్మెల్యేలు  సైదిరెడ్డి, లింగయ్య, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు  దామోదర్‌రెడ్డి, పద్మావతి, సంకినేని, మాజీ ఎంపీలు   నర్సయ్యగౌడ్‌, జి.వివేక్‌ నివాళులర్పించారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అరవింద్‌,  ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ సంతో్‌షబాబుకు ఇంటి వద్దనే నివాళులర్పించారు. అంతిమ యాత్రకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లం రాజు హాజరయ్యారు. 


కదిలించిన దృశ్యాలు

సంతోష్‌ బాబు కుమారుడు చిన్నవాడు కావడంతో తండ్రి ఉపేందరే తల కొరివి పెట్టారు. కుమారుడిని ఎత్తుకుని కల్నల్‌ భార్య సంతోషి చితి చుట్టూ మామ వెంట తిరగడం అందరి హృదయాలను బరువెక్కించింది. చితిపై నెయ్యి పోస్తూ భర్త చివరి చూపుకోసం ఆమె పడిన తపన కలిచివేసింది. తండ్రి ఇక లేడనే విషయం తెలియక.. ఏం జరుగుతోందో.. ఇంత జనం ఎందుకు వచ్చారో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ ఉన్న పిల్లలను చూసి జనం కన్నీరు పెట్టుకున్నారు. వీర సైనికుడి భార్యగా గొప్ప నిబ్బరం ప్రదర్శించిన సంతోషి,  పార్థివ దేహం కాసరబాదకు చేరగానే భోరున విలపించారు.

Updated Date - 2020-06-19T09:24:41+05:30 IST