అలా చదువు పూర్తి.. ఇలా ఎన్నికల్లో పోటీ
ABN , First Publish Date - 2020-12-01T09:12:57+05:30 IST
కాలేజీల నుంచి ఇటీవలే డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు అందుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆరాటపడకుండా రాజకీయాల్లోకి వచ్చారు. కాలేజీ విద్య ముగిసిన వెంటనే నేరుగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కార్పొరేట్ అభ్యర్థులుగా కొందరు బరిలో నిలిచారు. కొందరు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులుగా, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇలాంటి వారు మొత్తం 21 మంది ఉన్నారు

కాలేజీ టు కార్పొరేటర్ అభ్యర్థులు
ఇటీవలే డిగ్రీ, పీజీ పూర్తి
‘గ్రేటర్’ బరిలో 21 మంది వీరే
హైదరాబాద్ సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): కాలేజీల నుంచి ఇటీవలే డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు అందుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆరాటపడకుండా రాజకీయాల్లోకి వచ్చారు. కాలేజీ విద్య ముగిసిన వెంటనే నేరుగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కార్పొరేట్ అభ్యర్థులుగా కొందరు బరిలో నిలిచారు. కొందరు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులుగా, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇలాంటి వారు మొత్తం 21 మంది ఉన్నారు. వీరి వయస్సు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యే ఉంది. మల్కాజిగిరి నియోజకవర్గంలోని గౌతమ్‌నగర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తపస్విని యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల క్షేత్రంలోకి దిగిన తర్వాత తన మాటల తూటాలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తపస్విని ఇటీవల శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జియాగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ చౌగ్లే ఎన్నికల బరిలో నిలిచారు.
ఇటీవల బీకామ్ పూర్తి చేసి ఎంబీఏ చేయాలనే ఆలోచనతో ఐసెట్‌లో మెరుగైన ర్యాంకు సాధించారు. కానీ రాజకీయాలపై తనకున్న మక్కువతో కాంగ్రెస్ అభ్యర్థిగా జియాగూడ నుంచి బరిలోకి దిగారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ డివిజన్ టీఆర్ఎస్ టికెట్ కోసం ఇద్దరు విద్యార్థినులు ఎదురుచూశారు. ఎన్నికల్లో నామినేషన్లను వేసి బీఫామ్ కోసం ప్రయత్నించగా, దక్కకపోవడంతో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా ఎన్.వరలక్ష్మి, గుండు జ్యోత్స్నప్రియ పోటీ చేసున్నారు. జ్యోత్స్న ప్రియ ఇటీవల డిగ్రీ పూర్తి చేయగా, ఎన్.వరలక్ష్మి బీటెక్ పూర్తి చేశారు. సనత్‌నగర్ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పెరుమాళ్ల వైష్ణవి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైష్ణవి ప్రస్తుతం బీబీఏ ఫైనలియర్ చదువుతున్నారు.