జనవరి నుంచే.. ఓకేనా..

ABN , First Publish Date - 2020-12-16T04:51:24+05:30 IST

జనవరి నుంచే.. ఓకేనా..

జనవరి నుంచే.. ఓకేనా..
కల్లెడలో సర్టిఫికెట్లను అందిస్తున్న కలెక్టర్‌

డంపింగ్‌ యార్డులను పూర్తి స్థాయిలో ఉపయోగించాలి

అధికారులకు కలెక్టర్‌ హరిత ఆదేశం

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, డిసెంబరు 15: జిల్లా వ్యాప్తంగా డంపింగ్‌ యార్డులను జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని కలెక్టర్‌ ఎం.హరిత అధికారులకు సూచించారు. పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు, నర్సరీ మొక్కల పెంపకం వివిధ అభివృద్ధి పనులపై మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరణ జరగాలని, వచ్చేవారం నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. రోడ్లపై చెత్త కనిపించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి వనాల నిర్మాణాలు జిల్లా వ్యాప్తంగా 96 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. వనాల నిర్మాణాల భూ సమస్య ఉంటే త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతీ నర్సరీలో నీటి వసతి సంవృద్ధిగా ఉండాలని సూచించారు. వచ్చే వారం లోగా బ్యాగ్‌ ఫిల్లింగ్‌, ప్రైమరీ బెడ్‌ నిర్మాణం, షీడ్‌ కలెక్షన్‌ పూర్తి కావాలని అన్నారు. 


మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

పర్వతగిరి: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మంగళవారం కల్లెడలో డీఆర్‌డీఏ, జనశిక్షణ సంస్థాన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యూట్‌బ్యాగుల తయారీ శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై సర్టిఫికెట్లు అందించారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మహిళలకు పలు అంశాలపై శిక్షణనిచ్చి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం పర్వతగిరిలో నర్సరీ, వడ్లకొండలో నర్సరీ, ప్రకృతి వనం, రైతు వేదికలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ సంపత్‌రావు, ఆర్డీఎఫ్‌ ఫౌండర్‌ మెంబర్‌ ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, సర్పంచ్‌ శోభ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T04:51:24+05:30 IST