కో ఆప్షన్‌ ఏకగ్రీవమేనా?

ABN , First Publish Date - 2020-07-22T09:26:54+05:30 IST

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో కో-ఆప్షన్‌ పదవులకు భారీగా డిమాండ్‌ ఉన్నప్పటికీ.. ఏకగ్రీవాలకే ఎక్కువ అవకాశాలున్నాయు.

కో ఆప్షన్‌ ఏకగ్రీవమేనా?

  • పోటీ దరఖాస్తులు దాదాపు లేనట్లేనా?
  • అధిక స్థానాల్లో అధికార పార్టీకే అవకాశం

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో కో-ఆప్షన్‌ పదవులకు భారీగా డిమాండ్‌ ఉన్నప్పటికీ.. ఏకగ్రీవాలకే ఎక్కువ అవకాశాలున్నాయు. దాదాపు 92% మునిసిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండటమే దీనికి కారణం. దీంతో 90 శాతానికి పైగా కో-ఆప్షన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే వెళ్లనున్నాయన్నది సుస్పష్టం. కార్పొరేషన్లలో 5, మునిసిపాలిటీల్లో 4 వంతున కేటాయించిన ఈ పదవుల కోసం టీఆర్‌ఎ్‌సలో ఆశావహులు పైరవీల్లో మునిగిపోయారు. కో-ఆప్షన్‌ ఎంపికలో అధికార పార్టీ నేతల ప్రత్యక్ష ప్రమేయం ఎక్కడా కనిపించకపోయినప్పటికీ.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు సూచించిన వారికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో పదవులకు అవసరమైన సంఖ్య మేరకే దరఖాస్తులు వస్తాయని, తద్వారా కో ఆప్షన్‌లు దాదాపు ఏకగ్రీవమవుతాయని పేర్కొంటున్నారు. పదవుల సంఖ్యకు మించి దరఖాస్తులు వస్తే చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నికలు జరుపుతారు. పదవుల సంఖ్య కంటే తక్కువ దరఖాస్తులు వస్తే.. మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. జీహెచ్‌ఎంసీ శివారుల్లోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో కో-ఆప్షన్‌ పదవి దక్కించుకునేందుకు గరిష్ఠంగా రూ.50 లక్షల వరకూ ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23, 24 తేదీల్లో కో-ఆప్షన్‌ సభ్యులను ఎంపిక చేయనున్నారు.

Updated Date - 2020-07-22T09:26:54+05:30 IST