కరోనా వైరస్‌ పై యుద్ధానికి సీఎంఆర్‌ఎఫ్‌కు భారీగా విరాళాలు

ABN , First Publish Date - 2020-03-27T01:35:54+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు

కరోనా వైరస్‌ పై యుద్ధానికి సీఎంఆర్‌ఎఫ్‌కు భారీగా విరాళాలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతుసాయంగా పెద్దయెత్తున విరాళాలు ప్రకటించారు. శాంతాబయోటెక్స్‌ అధినేత, పద్మభూషణ్‌ కెఐ వరప్రసాద్‌రెడ్డి ప్రగతి భవన్‌లో గురువారం ముఖ్యమంత్రి   కేసీఆర్‌ను కలిసి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కు వ్యక్తిగత సాయంగా కోటి 116 రూపాయల చెక్కును అందించారు. కె ఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత కామిడి నర్సింహారెడ్డి కూడా సీఎంను కలిసి తమ కంపెనీ తరపున కోటి రూపాయల చెక్కును అందజేశారు. లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో డాక్టర్‌ సత్యనారాయణ, ఈడీ చంద్రకాంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌నుకలిసి తమ ల్యాబ్‌ తరపున ఒక లక్ష హైడ్రాక్సీక్లోరోక్విన్‌ టాబ్లెట్స్‌ను అందిస్తామని ప్రకటించారు. సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 50 లక్షల చెక్కును సీఎంకు అందించారు. కరోనా వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలపడంతోపాటు భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందించిన ఆర్ధిక సాయం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగ పడడంతో పాటువారు చూపించిన స్పూర్తి అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహం ఇస్తుందన్నారు. కాగా మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ సీఎంఆర్‌ఎఫ్‌కు 5 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండి పివి కృష్ణారెడ్డి ప్రగతి భవన్‌లో సీఎంను కలిసి అందించారు. ముఖ్యమంత్రి మెగా గ్రూప్‌కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మీనాక్షి గ్రూప్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందివ్వడానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును గురువారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీ రామారావుకు సంస్ధ ఛైర్మన్‌   కెఎస్‌ రావు , ఎండి శివాజీ అందించారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు ఉపయోగపడే ఎన్‌95 మాస్క్‌లను జిపికె ఎక్స్‌పోర్ట్స్‌ అండ్‌ ఇంపోర్ట్స్‌ యజమానులు ఫణికుమార్‌, కర్నాల శైలాజారెడ్డి గురువారం ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌నుకు ప్రగతి భవన్‌లో అందజేశారు. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ‘ క్రెడాయ్‌’ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ప్రగతి భవన్‌లో మున్సిపల్‌శాఖ మంత్రి కెటి రామారావుకు సంస్థప్రతినిధులు అందించారు. 

Updated Date - 2020-03-27T01:35:54+05:30 IST