30న ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ?

ABN , First Publish Date - 2020-12-26T06:47:35+05:30 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం కొత్త వేతనాలను ప్రకటించవచ్చని సమాచారం. ఎంతో కొంత ఫిట్‌మెంట్‌ను వెల్లడించవచ్చని తెలిసింది. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ ఈ నెల 30న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమవుతారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి

30న ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ?

కొత్త ఫిట్‌మెంట్‌ను ప్రకటించే అవకాశం

28 లేదా 29న ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక?

కమిషన్‌ గడువును పెంచకపోవచ్చు?


హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం కొత్త వేతనాలను ప్రకటించవచ్చని సమాచారం. ఎంతో కొంత ఫిట్‌మెంట్‌ను వెల్లడించవచ్చని తెలిసింది. ఈ విషయమై సీఎం కేసీఆర్‌ ఈ నెల 30న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమవుతారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త వేతనాల కోసం ఈ నెల 28 లేదా 29న ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక అందిస్తుందని, సంక్రాంతి కానుకగా ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేతనాల పెంపు కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. 2013 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 10వ పీఆర్సీ వేతనాలను ప్రభుత్వం 2014 జూన్‌ నుంచి వర్తింపజేసింది. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భం కావడంతో.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్‌ భారీ స్థాయిలో 43ు ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు.


దీని గడువు 2018 జూన్‌ 30తో పూర్తి కావడంతో జూలై 1 నుంచి కొత్త వేతనాలు అమలు కావాల్సి ఉంది. దీనిపై 2018 మేలో ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎ్‌సలు సీఆర్‌ బిశ్వాల్‌, మధుసూదనరావు, రఫత్‌ అలీతో 11వ పీఆర్సీని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ నుంచి నివేదిక అందగానే.. 2018 ఆగస్టు నుంచి కొత్త వేతనాలను అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, 2018 జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త వేతనాలకు ఇప్పటివరకు అతీ గతీ లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదనలో ఉన్నాయి. కాగా, ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నాలుగో తరగతి సిబ్బంది సంఘాల నుంచి కమిషన్‌ పలు విజ్ఞాపలు స్వీకరించింది.


నివేదికను కూడా అంతా సిద్ధం చేసి పెట్టినట్లు తెలిసింది. అయితే కమిషన్‌కు వేతనాలతోపాటు సర్వీస్‌ రూల్స్‌ వంటి ఇతర అంశాల బాధ్యతను కూడా ప్రభుత్వం అప్పగించింది. దీంతో వీటన్నింటి అధ్యయనం కోసం ఈ ఏడాది డిసెంబరు 31 వరకు గడువును పొడిగించింది. అంటే ఇంకా ఆరు రోజుల గడువే మిగిలి ఉంది. ఈ గడువును మళ్లీ పొడిగించకపోవచ్చని ఓ మంత్రి పేర్కొన్నారు. సీఎంకు కూడా గడువు పెంచే ఆలోచన లేదని తెలిపారు. ఆలస్యంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా ఆవేదనతో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, వారికి ఏదో ఒక వరాన్ని ప్రకటించాలన్న ఉద్దేశంతో పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటారని ఓ ఉద్యోగ సంఘం నేత వివరించారు.

Updated Date - 2020-12-26T06:47:35+05:30 IST