రేపు కీలక ఇంజనీరింగ్‌ విభాగాల ముఖ్యులతో కేసీఆర్‌ సమావేశం

ABN , First Publish Date - 2020-07-19T21:29:36+05:30 IST

రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజనీరింగ్‌ విభాగాల ముఖ్యులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం, మంగళవారాల్లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

రేపు కీలక ఇంజనీరింగ్‌ విభాగాల ముఖ్యులతో కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజనీరింగ్‌ విభాగాల ముఖ్యులతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం, మంగళవారాల్లో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 2గంటల  నుంచి నీటి పారుదల శాఖ, మంగళవారం మధ్యాహ్నం 2గంటల  నుంచి ఆర్‌అండ్‌బి శాఖ మంత్రులు, ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు. సమైక్య రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో తెలలంగాణ దారుణమైన ప్రాంతీయ వివక్షకు గురైంది. గోదావరి, కృష్ణానదుల మధ్య ఉన్నజీవగడ్డ తెలంగాణ కాబట్టి ఈ ప్రాంతానికి పుష్కలమైన నీటి వసంతి కల్పించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పించారు. సమగ్ర అవగాహనతో ప్రణాళికలు వేసి, వాటిని అమలు చేయడం వల్ల ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆరేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం నీటి పారుదల రంగంలో అద్భుత విజయాలు సాధించింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. చెరువులు పునరుద్దరించింది. సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతున్నది. సాగునీటి లభ్యత పెరిగి పుష్కలంగా పండుతున్నాయి. ఆయుకట్టు పెరుగుతున్నది. వ్యవసాయం విస్తరించింది. 2019-20 యాసంగిలో తాము సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచే దాదాపు 55శాతం వచ్చిందని ఎఫ్‌సిఐ స్వయంగా ప్రకటించడం తెలలంగాణ రాష్ట్రం వ్యవసాయంలో సాధించిన ప్రగతికి ఓ నిదర్శనం. తెలంగాణ గొప్పవ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నది.


వ్యవసాయానికి ప్రాణాధారం సాగునీరు. అందుకే రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగింది. సాగునీటి శాఖ ప్రాధాన్యతను గుర్తించిన కేసీఆర్‌ ఆ శాఖను పునర్వ్యస్ధీకరించి బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం నీటి పారుదల శాఖ చిలువలు, పలువలుగా వుంది. భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడిసి, ప్రాజెక్టులు, ప్యాకేజీలపేరుతో విభజించి వుంది. ఇదంతా ఒకే గొడుగు కిందికి రావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా ఉంటుందని సీఎం భావించారు. అందుకే నీటి పారుదలశాఖను 15 నుంచి 20 ప్రాదేశిక విభాగాలుగా మార్చి ఒక్కో దానికి ఒక్కో సీఈని ఇన్‌చార్జిగా నియమించాలని నిర్ణయించారు.


ఆ సీఈ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిప్టులు, కాలువలు, చెరువులు, చెక్‌డ్యాములు సమస్తం ఉంటాయి. దీనికి సంబంధించి ముసాయిదా తయారు చేయాలని గతవారం జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌ రెండు రోజుల పాటు నీటి పారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ పై వర్క్‌షాపు నిర్వహించారు. ముసాయిదా రూపొందించారు. దీనిని సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పిస్తారు. 


ఈ ముసాయిదా పై సమీక్షలో సర్వ సమగ్ర చర్చ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సీఎం కార్యదర్శి , ఈఎన్సీలు పాల్గొంటారు. తెలంగాణ సెక్రటేరియట్‌ నూతన భవన సముదాయం నిర్మాణం పై మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్‌తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకంగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. 


మంగళవారం నాటి సమీక్షలో డిజైన్లను చర్చిస్తారు. సెక్రటేరియట్‌ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిస్తారు. అనంతరం వాటి ని మంత్రి వర్గంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు. ఆర్‌అండ్‌బి సమీక్షలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శి, ఇంజనీరింగ్‌ అధికారులు, తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్‌, పొన్నితదితరులు పాల్గొంటారు. 

Updated Date - 2020-07-19T21:29:36+05:30 IST