జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-12-29T01:04:38+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్ధీకరించింది.

జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం ప్రగతి భవన్‌లో జల వనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటి పారుదల విభాగలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకు రావడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జల వనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్ధీకరణ చేశారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు.


రాష్ట్రం మొత్తాన్ని 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌, రామగుండం, వరంగల్‌, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్‌, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌,కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలు ఉంటాయి. ఆరుగురు ఈఎన్సీలను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని నిర్ణయించారు. 


జనరల్‌, అడ్మినిస్ర్టేషన్‌,ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్ధానంలో కూడా ముగ్గురు సీనియర్‌ అధికారులకు ఈఎన్సీ క్యాడర్‌లో బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముగ్గురు ఈ ఎన్సీలు ఉంటే కొత్తగా మరో మూడు ఈ ఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలో ఈఎన్సీల సంఖ్య ఆరుకు చేరుకుంటుంది. సీఈ పోస్టులను 19 నుంచి 22 వరకు, ఎస్‌ఈల పోస్టులను 47 నుంచి 57 కు, ఈఈల పోస్టులు 206 నుంచి 234 వరకు , డీఈఈల పోస్టులు 678 నుంచి 892కు, ఏ ఈఈల పోస్టులను 2,436 నుంచి 2,796కు, టెక్నికల్‌ ఆఫీసర్ల సంఖ్యను 129 నుంచి 199 వరకు, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్ల సంఖ్యను 173 నుంచి 242కు, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్ల సంఖ్య 346 నుంచి 398కి, నాన్‌టెక్నికల్‌ పర్సనల్‌ ఆసిస్టెంట్‌ల సంఖ్యను 31 నుంచి 45కు, సూపరింటెండెంట్‌ల సంఖ్యను 187 నుంచి 238కి, రికార్డు అసిస్టెంట్‌ల సంఖ్యను 134 నుంచి 205కు పెంచారు.


పునర్వ్యవస్ధీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-12-29T01:04:38+05:30 IST