ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లకు అవకాశం-కేసీఆర్
ABN , First Publish Date - 2020-11-16T00:40:20+05:30 IST
అర్హత కలిగి ఉండీ భర్తీకి అవకాశం ఉన్న ఇతర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేయడానికి వెళ్లదలచుకున్న జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు.

హైదరాబాద్: అర్హత కలిగి ఉండీ భర్తీకి అవకాశం ఉన్న ఇతర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేయడానికి వెళ్లదలచుకున్న జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రి సబితారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్,ఆర్ధిక శాఖ ముఖ్య కార్య దర్శి రామకృష్ణారావు , సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కాలేజీ లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను , విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘ జూనియర్ కాలేజీ కాం ట్రాక్టు లెక్చరర్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది.
వారిని రెగ్యులరైజ్ చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం కోర్టు కేసుల వల్ల నిలిచిపోయింది. అయినా అంతటితో ఆగకుండా వారి నెల జీతాలను గతంలో కంటే రెట్టింపుచేసింది. ప్రభుత్వం సంవత్సర కాలానికి కేవం పది నెలలు మాత్రమే జీతాలు చెల్లించే పరిస్ధితి గతంలో ఉండేది. తెలంగాణ ప్రభుత్వం దాన్ని పన్నెండు నెలలకు పెంచి సంవత్సర కాలం పూర్తి జీతం ఇస్తున్నది. దాంతో పాటు వారికి సర్వీసు బెనిఫిట్స్‌ను కూడా అందిస్తున్నం.
సెలవులను పెంచినం. కాజువల్ లీవులు, మెటర్నిటీ లీవుల సదుపాయాలను కల్పించినం. ఇంక గూడా సాధ్యమైనంత మేరకు నిబంధనలు అనుమతించిన మేరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని సీఎం స్పష్టం చేశారు.
తమకు అనువైన మరో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలనే జూనియర్ లెక్చరర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని నియమ నిబంధనలను అన్ని కోణాల్లో పరిశీలించి అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.