కంది పంట వేయకపోతే రైతుబంధు వర్తించదు: కేసీఆర్

ABN , First Publish Date - 2020-05-19T02:26:17+05:30 IST

తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోందని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. పంటల ఉత్పత్తిలో తెలంగాణ చరిత్ర సృష్టిస్తోందన్నారు

కంది పంట వేయకపోతే రైతుబంధు వర్తించదు: కేసీఆర్

హైదరాబాద్:  తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోందని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. పంటల ఉత్పత్తిలో తెలంగాణ చరిత్ర సృష్టిస్తోందన్నారు. తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా అభివర్ణించారు. రైతులెవరూ మొక్కజొన్న పంట వేయొద్దన్నారు. ఈ సారి కందిపంట వేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేయకపోతే రైతుబంధు వర్తించదని హెచ్చరించారు. ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రైతు బీమా వర్తిస్తుందని చెప్పారు. రైతు బీమా, ఉచిత కరెంట్‌ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో అన్ని రకాల పంటలు పండుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో సగటున 900 మి.మీ వర్షపాతం ఉందన్నారు. మన వాతావరణం వ్యవసాయానికి అనుకూలమని కేసీఆర్ స్పష్టం చేశారు. 


పాడి రైతులకు లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకాలు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు ఇస్తున్నట్లు ప్రకటించారు. 2,604 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి క్లస్టర్‌కు ఏఈవోను నియమించినట్లు చెప్పారు. ఎరువులు, విత్తనాల కొరతను అధిగమించామన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠినంగా వ్యవహరిస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పీడీ యాక్ట్‌ తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. రైతు వేదికల నిర్మాణానికి రూ. 350 కోట్లను కేటాయించామన్నారు. 


న్యూస్‌ ఛానల్‌లో రైతులతో ముఖాముఖి

ఈ ఏడాది 90 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. మైక్రో ఇరిగేషన్‌పై 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో రికార్డ్‌ స్థాయిలో పంటలు పండిస్తున్నట్లు స్పష్టం చేశారు. అందరూ ఒకే రకమైన పంట వేసి ఇబ్బంది పడే బదులు.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల తలరాత వాళ్లే రాసుకోవాలన్నారు. తెలంగాణలో ఎవరూ రైతులు అప్పుల పాలు కావొద్దని ఆకాంక్షించారు. త్వరలో న్యూస్‌ ఛానల్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తానని కేసీఆర్‌ ప్రకటించారు.

Updated Date - 2020-05-19T02:26:17+05:30 IST