వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ పట్టాలు

ABN , First Publish Date - 2020-09-24T08:27:01+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలందరికీ మెరూన్‌ కలర్‌ పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయనున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్‌ పట్టాలు

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. ఉచితంగా ఆస్తుల నమోదు 

పేదల ఇళ్లు క్రమబద్ధీకరణ.. తద్వారా రుణాలకు వీలు

సాదా బైనామా, జీవో 58, 59లకు చివరి అవకాశం

నేడు కార్పొరేషన్ల పరిధి ఎమ్మెల్యేలు, మేయర్లతో సీఎం భేటీ

ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్‌లు ఇక తెలుగులోనూ

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష


హైదరాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలందరికీ మెరూన్‌ కలర్‌ పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయనున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. దేశంలో ఈ విధానాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రం తెలంగాణయేనని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిధిలోని ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, బావుల వద్ద నిర్మించుకున్న ఇళ్లు, ఫామ్‌హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ పూర్తి ఉచితంగా ఆన్‌లైన్‌లో నమోదు(మ్యుటేషన్‌) చేసుకోవాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజల దీర్ఘకాల, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. భూ వివాదాలు, ఘర్షణల నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసమే వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పాసు పుస్తకాలను జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక ముందు అంగుళం భూమి అయినా ఒకరి నుంచి మరొకరి పేరు మీదకు బదిలీ కావాలన్నా దరణి పోర్టల్‌ ద్వారా మా త్రమే రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని కేసీఆర్‌ పేర్కొన్నారు.  ప్రస్తుతం ఆస్తుల వివరాలను మ్యుటేషన్‌ చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.


నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇళ్ల స్థలాలను పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరిస్తామని, దీని వల్ల నిరుపేదల ఇంటి స్థలాలకు రక్షణ ఉంటుందని, ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు వారికి కలుగుతుందని పేర్కొన్నారు. ఈ ఆస్తుల మీద మ్యుటేషన్‌కు, ఎల్‌ఆర్‌ఎ్‌సకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇళ్లు ఎలా నిర్మించారన్నది పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ చట్టాలకు, నిబంధనలకు లోబడే ఉంటుందని చెప్పారు. వ్యవసాయ భూముల పరిధిలోని గ్రామ పంచాయతీలు, మునిసిపల్‌ పరిధిలో నిర్మించుకున్న ఇళ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరీ నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మునిసిపల్‌ చైర్మన్‌లు, సిబ్బంది పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ఎంపీవోలు దీనిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ‘‘గ్రామాలు, మునిసిపాలిటీల పరిఽధిలో ఉన్న ప్రతి ఇంటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు కావాలి.


ఇంటికి నంబరు కేటాయించాలి. పన్నులు వసూలు చేయాలి. నాన్‌ అగ్రికల్చర్‌ కింద నాలా కన్వర్షన్‌ మార్చాలి. ఈ విషయంలో వంద శాతం ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే విషయంలో పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ధరణి పోర్టల్‌ ప్రారంభమైన తర్వాతనే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుంది’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎండోమెంట్‌, వక్ఫ్‌, ఎఫ్‌టీఎల్‌, నాలా, యుఎల్‌సీ పరిధిలో నిర్మించుకున్న ఇళ్లకు ఈ మ్యుటేషన్‌ వర్తించదని చెప్పారు. భవిష్యత్తులో ఆస్తుల నమోదు ప్రక్రియ, రెగ్యులరైజేషన్‌, ఉచిత నాలా కన్వర్షన్‌ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, ఇదే చివరి అవకాశం అని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు. 


మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసకోవాలి

వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియతో పాటు ప్రజలకు ప్రభుత్వం అందించే మెరూన్‌ కలర్‌పాసు పుస్తకాలను అందించే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మండల-గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేసీఆర్‌ సూచించారు. ఆస్తుల వివరాల ఆన్‌లైన్‌లో నమోదును కూడా అధికారులు, సిబ్బందితో పర్యవేక్షించాలని ఆదేశించారు. 


సాదా బైనామాలకు చివరి అవకాశం

గ్రామీణ ప్రాంతాల్లో భూముల పరస్పర కొనుగోళ్ళ మార్పిడికి సంబంధించిన సాదాబైనామాను ఉచితంగా మ్యుటేషన్‌ చేయించే ప్రక్రియకు చివరిసారిగా త్వరలో అవకాశం కల్పించనున్నట్లు కే సీఆర్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు, భవిష్యత్తులో ఇక సాదాబైనామాలకు అనుమతించే ప్రసక్తే లేదని తెలిపారు. అయితే, ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, ఇంకా వివాదాలు ఉంటే కోర్టుల్లో తేల్చుకోవాల్సి ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవో 58, 59 పరిధిలోని పేదల ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఒకటి, రెండు రోజుల్లో జీవో ద్వారా వెల్లడించనున్నట్లు సీఎం వివరించారు. ఈ మేరకు అంశాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలు, మేయర్లతో గురువారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ సమావేశం కానున్నారు. కాగా ప్రభుత్వం ఇక నుంచి విడుదల చేసే అన్ని జీవోలు, సర్క్యులర్‌లను తెలుగు, ఇంగ్లిషు భాషల్లో విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కేసీఆర్‌ ఆదేశించారు.

Updated Date - 2020-09-24T08:27:01+05:30 IST