రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2020-12-10T07:47:50+05:30 IST
టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజులపాటు అక్కడే ఉండనున్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని అపాయింట్‌మెంట్ కోరింది. అది ఖరారైతే, మోదీతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల

మూడు రోజుల పాటు పర్యటన
ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎంవో
పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం
టీఆర్‌ఎస్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన
నేడు సిద్దిపేటకు సీఎం.. పలు ప్రారంభోత్సవాలు
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో బహిరంగ సభ
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజులపాటు అక్కడే ఉండనున్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని అపాయింట్‌మెంట్ కోరింది. అది ఖరారైతే, మోదీతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ప్రధాని అపాయింట్‌మెంట్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌సహా మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను మంజూరు చేయాలని కోరే అవకాశం ఉంది.
అలాగే, ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్ కార్యాలయం కోసం కేంద్రం స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కోసం ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ కొంత కాలంగా అనుకుంటున్నా.. వేర్వేరు కారణాలతో పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. కాగా, సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
ఐటీ టవర్‌కు నేడు శంకుస్థాపన
సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దుద్దెడలో నిర్మించనున్న ఐటీ టవర్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, పొన్నాల గ్రామంలో నిర్మించిన టీఆర్‌ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఎన్సాన్‌పల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాన్ని ప్రారంభించి, అక్కడే వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీని పరిశీలించి, మురుగునీటి శుద్ధి ప్లాంటును ప్రారంభిస్తారు. సిద్దిపేట శివారు నర్సాపూర్‌లో నిర్మించిన 2,460 డబుల్ బెడ్‌రూం ఇళ్లలో తొలివిడతగా 144 మంది లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తారు. విపంచి ఆడిటోరియంను ప్రారంభించి కోమటిచెరువు మినీ ట్యాంకుబండ్‌ను సందర్శిస్తారు. తర్వాత రంగనాయకసాగర్ రిజర్వాయర్ గుట్టపై నిర్మించిన గెస్ట్‌హౌస్ ప్రారంభిస్తారు. చివరగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 15వేల మందితో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు.
కలెక్టరేట్, కమిషనరేట్ ప్రారంభం వాయిదా
సిద్దిపేటలో నూతన కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్ భవనాల నిర్మాణం పూర్తి కాగా, సీఎం కేసీఆర్ ఎప్పుడొచ్చినా వీటిని ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. అయితే.. తాజా సీఎం పర్యటన షెడ్యూల్‌లో ఈ భవనాల ప్రారంభోత్సవానికి అవకాశం దక్కలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం కొనసాగుతుండగా.. కొన్ని తుది దశకు చేరాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట సహా అన్ని జిల్లాల్లో ఒకేసారి కలెక్టరేట్లను ప్రారంభించాలని అధికార పార్టీ యోచిస్తోంది. ఆయా జిల్లాల్లో సీఎం పర్యటనలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.