అదుపులోనే కరోనా

ABN , First Publish Date - 2020-06-18T08:25:54+05:30 IST

తెలంగాణలో కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదవుతోందన్నారు. వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు

అదుపులోనే కరోనా

  • హైదరాబాద్‌, చుట్టుపక్కల మాత్రమే కేసులు: కేసీఆర్‌
  • మళ్లీ లాక్‌డౌన్‌ ఉంటుందా అని మోదీకి ప్రశ్న
  • ఉండబోదని ప్రధాని స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదవుతోందన్నారు. వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరుతో కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్నామని, కొద్ది రోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ‘‘ప్రజల సాధారణ జీవనం మళ్లీ ప్రారంభమవుతోంది. వివిధ రాష్ర్టాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు పని చేసుకోవడానికి తిరిగి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారికి ఆ అవకాశం కల్పించాలి. దేశమంతా ఒక్కటే.. ఎక్కడికి వెళ్లయినా పనిచేసుకునే అవకాశం ఉండాలి’’ సీఎం అన్నారు. 


నితీష్‌ గారూ... హమాలీలను పంపించండి!

బిహార్‌ నుంచి హమాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారని కేసీఆర్‌ తెలిపారు. వారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ కేసీఆర్‌ సరదాగా మాట్లాడారు. ‘‘నితీశ్‌గారూ.. తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం. మా సీఎస్‌ కూడా మీ బిహార్‌ వారే. దయచేసి హమాలీలను పంపించండి’’ అని అన్నారు.


ఇక దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో ప్రధాని స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘‘ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్‌డౌన్‌పై ప్రకటన చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. సీఎంలతో మాట్లాడకుండా లాక్‌డౌన్‌ విషయంలో పీఎం నిర్ణయం తీసుకోరని నేను చెబుతున్నాను. దీనిపై స్పష్టత ఇవ్వండి’’ అని కోరారు. దీనికి మోదీ.. ‘‘దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదు. అన్‌లాక్‌ 1.0 నడుస్తోంది. అన్‌లాక్‌ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై చర్చించుకోవాలి’’ అని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-06-18T08:25:54+05:30 IST