ఏపీ అభ్యంతరాలు అర్థం లేనివి
ABN , First Publish Date - 2020-08-20T09:07:41+05:30 IST
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సర్కారు అభ్యంతరాలన్నీ అర్థం లేనివని సీఎం కేసీఆర్ అన్నారు.

- తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదు
- ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులే రీడిజైన్ చేశాం
- కేంద్రం, ఏపీ సందేహాలన్నీ నివృత్తి చేస్తాం
- ‘అపెక్స్ కౌన్సిల్’పై సమీక్షలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సర్కారు అభ్యంతరాలన్నీ అర్థం లేనివని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నెల 25న జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్రంతోపాటు ఏపీ లేవనెత్తే సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామన్నారు. దీనికి సంబంధించి సమాచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడాన్ని సీఎం స్వాగతించారు. సమావేశానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని, అజెండా అంశాలనూ అందులో పేర్కొనాలని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేేసందుకు బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. వాస్తవానికి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులనే రీడిజైన్ చేశామని చెప్పారు. ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఎన్ని నిధులు కేటాయించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు?వంటి వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ వ్యవహరిస్తున్న అంశాన్ని ఆధారాలతో వివరించాలని చెప్పారు. అదే సమయంలో ఏపీ అక్రమంగా నీటిని వాడుకోవడంపై నిలదీయాలని చెప్పారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగతున్న అన్యాయాలపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేశామని, ఈసారైనా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాల్సిందిగా కోరతామని చెప్పారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, రాజీవ్‌శర్మ, ఎస్.కె.జోషి, రజత్ కుమార్ పాల్గొన్నారు.