రంగంలోకి కేసీఆర్!
ABN , First Publish Date - 2020-10-03T09:25:18+05:30 IST
రానున్న వివిధ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులను సమాయత్తం చేయడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు
పట్టభద్రుల ఎమ్మెల్సీ, కార్పొరేషన్ల ఎన్నికల్లో విజయమే లక్ష్యం
నేడు 6 జిల్లాల ప్రజాప్రతినిధులతో భేటీ
హైదరాబాద్, అక్టోబర్ 2 (ఆంధ్రజ్యోతి): రానున్న వివిధ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులను సమాయత్తం చేయడానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావు రంగంలోకి దిగుతున్నారు. త్వరలో జరుగుతాయని భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన సూత్రప్రాయంగా ఖరారు చేయబోతున్నారు. ఇందుకోసం ఆయన.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలకు చెందిన కీలక ప్రజాప్రతినిధులతో శనివారం భేటీ కావాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా ప్రగతి భవన్‌కు చేరుకోవాలని ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్తమానం పంపించారు.
షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగాల్సిన వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు కార్యక్రమం గురువారం నుంచి మొదలైంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో కొంచెం అటు, ఇటుగా పదవీకాలం పూర్తి చేసుకోనున్న జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక భేటీ దాదాపు రెండు, మూడు గంటలపాటు జరిగే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై.. ఆరు ఉమ్మడి జిల్లాల మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్ ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు.