వడ్డనకు ఓకే...
ABN , First Publish Date - 2020-02-29T08:21:54+05:30 IST
విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. 2019-20, 2020-21 సంవత్సరాలకు గాను వార్షిక ఆదాయ
కరెంట్ చార్జీల పెంపునకు సీఎం గ్రీన్ సిగ్నల్
వార్షిక ఆదాయ అవసరాలను సమర్పించండి
టారిఫ్ ప్రతిపాదనలను సిద్ధం చేయండి
డిస్కమ్‌లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
గృహ వినియోగ చార్జీలు పెరిగే అవకాశం
కరెంటు చార్జీలను సవరించాలన్న తెలంగాణ డిస్కమ్‌ల ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. కరెంట్ చార్జీలను పెంచడానికి అనుమతించారు. టారిఫ్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని శుక్రవారం అధికారులను ఆదేశించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించి విద్యుత్ శాఖపై ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూనిట్‌కు 19 పైసల లోటు ఉందని, ప్రభుత్వ సబ్సిడీతో డిస్కమ్‌లు నెట్టుకురాలేవని అధికారులు ఈ సందర్భంగా చెప్పారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): విద్యుత్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. 2019-20, 2020-21 సంవత్సరాలకు గాను వార్షిక ఆదాయ అవసరాలను(ఏఆర్ఆర్)ఈఆర్సీలో సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఆ తర్వాత టారిఫ్ ప్రతిపాదనలను ప్రత్యేకంగా సమర్పిస్తే... చర్చించి, చార్జీలపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూనిట్‌కు 19 పైసల లోటు ఉందని, ప్రభుత్వ సబ్సిడీతో డిస్కమ్‌లు నెట్టుకురాలేవని చెప్పారు. డిస్కమ్‌లు వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రూ.13,647 కోట్ల దాకా బకాయి ఉన్నాయని కేసీఆర్‌కు నివేదించారు.
లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) విధానం అమలుతో ఏ వారం కరెంటు కోసం ఆ వారానికి సరిపడా డబ్బులు ముందే కడుతున్నామని గుర్తు చేశారు. కరెంట్ చార్జీలను సవరించకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. డిస్కమ్‌లు శనివారం ఏఆర్‌ఆర్‌ను దాఖలు చేసే అవకాశాలున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఆదాయానికి, రాబడికి మధ్య యూనిట్‌కు 39 పైసల లోటు ఉండగా, ఎన్పీడీసీఎల్ పరిధిలో 19 పైసల లోటు ఉండటం గమనార్హం. ఇక, కరెంటు చార్జీ లు ఎంత మేర పెరుగుతాయన్నదానిపై స్పష్టత లేదు. ప్రధానంగా గృహ వినియోగ కేటగిరీలో(ఎల్టీ) చార్జీలు పెరిగే అవకాశాలున్నాయి. పారిశ్రామిక వర్గాలపై కూడా కొంత భారం పడే అవకాశాలున్నాయి.
ఆదాయానికి, అవసరాలకు భారీ తేడా
2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.9 వేల కోట్లకు పైగా ఆర్థిక లోటు ఉంటుందని గత ఏడాది డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌ను సమర్పించాయి. ఈ మేరకు విద్యుత్ చార్జీలు పెంచి లోటును భర్తీ చేయాల్సి ఉండగా, విద్యుత్ చార్జీల సవరణకు ప్రభుత్వం అనుమతించలేదు. పైగా సబ్సిబీ రూపంలో చెల్లించాల్సిన మొత్తంలో రూ. 1000 కోట్లు కోత పెట్టింది. క్రమంగా 2019-20 నాటికి డిస్కమ్‌ల బకాయిలు రూ. 13,647 కోట్లకు పెరిగాయి. విద్యుత్ కొనుగోలు వ్యయంలో మార్పులు, విద్యుత్ డిమాండ్ పెరగడంతో ఆర్థిక లోటు క్రమంగా ఎక్కువవుతోంది.
నాలుగున్నరేళ్లలో 65ు జీతాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తొలి విడతలో విద్యుత్ ఉద్యోగులకు 30ు ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం... ఏడాది కింద మరో 35ు పెంచింది. ఫలితంగా నాలుగున్నరేళ్లలో ఉద్యోగుల వేతనాలు ఏకంగా 65ు పెరిగాయి. దీంతో డిస్కమ్‌లు ఉద్యోగుల వేతనాలకే ఏకంగా రూ.2 వేల కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కరెంటు బకాయిలు, మరోవైపు ఉద్యోగుల వేతనభారంతో డిస్కమ్‌లు కరెంటు చార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.