డీఈకి 50 లక్షలు.. ఇతరులకు 25 లక్షలు
ABN , First Publish Date - 2020-08-22T08:21:51+05:30 IST
శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ పరిహారాన్ని ప్రకటించారు.
- మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
- పరిహారాన్ని ప్రకటించిన సీఎం
- విచారణకు సీఐడీ, శాఖాపరమైన
- అధికారులతో రెండు కమిటీలు
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ పరిహారాన్ని ప్రకటించారు. డీఈ శ్రీనివా్‌సగౌడ్ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా మృతుల కుటుంబాలందరికీ రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, ఇతర శాఖాపరమైన ప్రయోజనాలు కూడా అందిస్తామన్నారు. శ్రీశైలం విద్యుత్తు కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీఐడీతో పాటు శాఖాపరమైన అధికారులతో కమిటీలు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. విచారణ అనంతరం కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందించాలని జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావును సీఎస్ ఆదేశిస్తూ జీవో నంబరు 1223ను జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలేంటి ? అనే దిశగా గుర్తించే అంశాలు, సిఫారసులను విచారణ నివేదికలో పొందుపరచాలని పేర్కొన్నారు.
సీఎం ఆదేశాల నేపథ్యంలో ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీచేస్తూ మరో జీవో నెం.1222ను సీఎస్ విడుదల చేశారు. విచారణాధికారిగా సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్‌ను నియమించగా, ఆయనకు సహాయం చేసేలా తగిన సిబ్బందిని సమకూర్చాలని జెన్‌కో సీఎండీని ఆదేశించారు. కాగా, శ్రీశైలం ప్రమాద ఘటనపై శుక్రవారం ఉదయం నుంచే సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంపై విచారం వ్యక్తం చేసిన సీఎం.. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని అభివర్ణించారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు ప్రభుత్వ ఖర్చుతోనే వైద్యం చేయించాలని అధికారులను ఆదేశించారు.