మల్లన్నసాగర్‌ ట్యాంక్‌బండ్‌కు లైన్‌ క్లియర్‌

ABN , First Publish Date - 2020-12-30T06:48:48+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి లైన్‌ క్లియరైంది. పిటిషనర్ల భూముల్లోని పంటల జోలికి పోవద్దని, విద్యుత్తు కనెక్షన్లు తొలగించవద్దని 2019 నవంబరు

మల్లన్నసాగర్‌ ట్యాంక్‌బండ్‌కు లైన్‌ క్లియర్‌

మధ్యంతర ఆదేశాలు సవరించిన ధర్మాసనం

పల్లెపహాడ్‌లో పనులను అడ్డుకున్న గ్రామస్థులు


హైదరాబాద్‌/తొగుట, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి లైన్‌ క్లియరైంది. పిటిషనర్ల భూముల్లోని పంటల జోలికి పోవద్దని, విద్యుత్తు కనెక్షన్లు తొలగించవద్దని 2019 నవంబరు 22న డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలకు హైకోర్టు స్వల్ప సవరణలు చేసింది. కొద్దిపాటి భూసేకరణలో తలెత్తిన వివాదం కారణంగా పనులు నిలిచిపోవడం సరికాదని అభిప్రాయపడిన ధర్మాసనం.. ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలపై అభ్యంతరాలుంటే పిటిషనర్లు మెరిట్‌ ప్రకారం తమ వాదనలు వినిపించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పూర్తి పరిహారం చెల్లించేదాకా భూసేకరణను నిలిపివేయాలంటూ సిద్ధిపేట జిల్లా, తొగుట మండలం, ఏటిగడ ్డకిష్టాపూర్‌ గ్రామానికి చెందిన సీహెచ్‌ .ఉమ్మారెడ్డి మరో ఇద్దరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.


దాంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఈ ఆదేశాలను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం స్టే వెకేట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎ్‌స.ప్రసాద్‌ వాదిస్తూ.. కొద్దిపాటి భూసేకరణలో తలెత్తిన వివాదంలో కోర్టు ఉత్తర్వులవల్ల మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం 22.6 కిమీ మేర ట్యాంక్‌ బండ్‌ నిర్మాణం నిలిచిపోయిందన్నారు. మధ్యంతర ఆదేశాలను అడ్డుపెటుకుని పిటిషనర్లు భూములు స్వాధీనపర్చడం లేదన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాది సీహెచ్‌.రవికుమార్‌ వాదిస్తూ.. భూసేకరణ చట్టం-2013 ప్రకారం పూర్తి పరిహారం, పునరావాసం కల్పించేంత వరకు భూములు స్వాధీనం చేసుకోడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టు ‘వి.కె.రవిచంద్ర వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందన్నారు. ఈ వ్యాజ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడం లేదని స్పష్టం చేసింది. గత ఆదేశాలకు స్వల్ప సవరణలు చేస్తున్నట్లు తెలిపింది.


పల్లెపహడ్‌లో ఉద్రిక్తత..

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం పల్లెపహడ్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి పరిహారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు మల్లన్నసాగర్‌ కట్ట పనులకు వెళ్లే రహదారిలో బైఠాయించారు. అక్కడే వంటావార్పు నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. అధికారులు వెంటనే ఆర్డీవోతో మాట్లాడి సమస్యను వివరించారు. గ్రామంలో రీసర్వే చేసి అర్హులైన వారందరికీ పరిహారం అందిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు తమ ఆందోళనను విరమించారు.

Updated Date - 2020-12-30T06:48:48+05:30 IST